ఉజ్బెకిస్థాన్‌ మహిళకు.. 

ఢిల్లీ వైద్యుల అరుదైన చికిత్స
– 32ఏళ్ల తరువాత తిరిగి కూర్చోగలిగిన మహిళ
న్యూఢిల్లీ, జులై6(జ‌నం సాక్షి ) : ఉజ్బేకిస్తాన్‌ మహిళకు ఢిల్లీ వైద్యులు అరుదైన చికిత్స అందించారు.. ఫలితంగా 32ఏళ్ల తరువాత ఆ మహిళ కూర్చోగలిగేలా చేశారు. ఐదేళ్ల వయసులో అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం ఆమె జీవితానికి శాపంగా మారింది. దాని ఫలితంగా 32ఏళ్లు ఆమె కూర్చోవడానికి దూరమైంది. జీవితమంతా నిలబడటం, పడుకోవడమేనా అనే నిరుత్సాహంలో ఉన్న ఆమె కళ్లల్లో వెలుగు నింపారు ఢిల్లీ వైద్యులు. 37ఏళ్ల వయసులో ఆమె తిరిగి కూర్చోగలిగారు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన గుల్నోరా రాపిఖోవా ఐదేళ్ల వయసులో ప్రమాదానికి గురైంది. ఒక రోజు ఇంట్లోని స్టవ్‌ దగ్గర నిల్చున్నప్పుడు గుల్నోరా దుస్తులకు మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. కాలుతున్న మంటలతోనే ఆమె బయటకు పరిగెత్తింది. ఇరుగూ పొరుగు వారు చూసి మంటలు ఆర్పి స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రమాదం కారణంగా గుల్నోరా తొడల కింద భాగం తీవ్రంగా కాలిపోయింది. దాదాపు 18నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా గాయాలు మానలేదు. ఐదు సార్లు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. ఫలితంగా ఆమె కూర్చోలేకపోయారు. దీంతో నిలబడటం, ఒకవైపు తిరిగి పడుకోవడం చేసేవారు. అలా ఒకటి కాదు రెండు కాదు గత 32ఏళ్లుగా గుల్నోరా ఒక్క రోజు కూడా కూర్చున్నది లేదు. ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన నాటి నుంచి నాకు చాలా కష్టంగా మారింది. కానీ, ఏం చేయలేకపోయాం. ఎనిమిదేళ్ల వయసులో నేను స్కూలుకు వెళ్లడం ప్రారంభించా. అయితే స్కూల్లో రోజంతా నిలబడాల్సి వచ్చేది అని గుల్నోరా ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే భారత వైద్యుల వల్ల ఆరు నెలల క్రితం ఆమె జీవితంలో మార్పు వచ్చింది. ఇటీవల ఢిల్లీకి చెందిన ఇందప్రస్థ అపోలో ఆసుపత్రి.. ఉజ్బెకిస్థాన్‌లోని సర్దర్యా ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. ఈ శిబిరం గురించి తెలుసుకున్న గుల్నోరా అక్కడకు వెళ్లి వైద్యులను సంప్రదించింది. ఆమె పరిస్థితి గురించి తెలిసి అపోలో వైద్యులు నిర్ఘాంతపోయారు. వెంటనే ఆమెను పరిశీలించి చికిత్స అందించేందుకు ముందుకొచ్చారు. అయితే గుల్నోరా కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. దీంతో స్థానికంగా ఉండే ఓ మానవతావాది ఆమె భారత్‌ వెళ్లేందుకు సాయం చేశారు. అలా మే 26న గుల్నోరా ఢిల్లీకి చేరుకున్నారు. మే 31న అపోలో వైద్యులు ఆమెను శస్త్రచికిత్స చేశారు. ఇటీవలే ఆమె కోలుకుని తిరిగి కూర్చోగలిగింది. ‘నేను మళ్లీ కూర్చుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంత భయం కూడా వేస్తోంది. నేను కూర్చోగలుగుతున్నానని మా అమ్మానాన్నలకు చెప్పాను. కానీ నన్ను చూస్తే గానీ వారు నమ్మలేరని గుల్నోరా సంతోషంగా చెప్పింది.