ఉట్నూరు కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిందే

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): గిరిజనులకు న్యాయం జరగాలంటే, షెడ్యూల్డ్‌ ప్రాంతం విడిపోకుండా ప్రజల అవసరాలు, పాలన సౌలభ్యం కోసం ఉట్నూరులోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. జిల్లా ఏర్పాటులో అన్యాం జరిగిన ఉట్నూరుకు ఈ రకంగా మేలుచేయాలని కోరుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్‌ వాసులకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఆదిలాబాద్‌కు కేటాయించిన గిరిజన యూనివర్సిటీని వరంగల్‌కు తరలించి జిల్లావాసులకు నష్టం చేశారన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాను కొమరం భీం, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో షెడ్యూల్డ్‌ ప్రాంతంలో నివసించే ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. షెడ్యూల్డ్‌ భూగంగా ముక్కలవుతోందన్నారు. జోనల్‌ వ్యవస్థను రద్దు చేయడంతో ఏజెన్సీలోని గిరిజనేతరులకు కూడా ఎక్కడ ఉద్యోగాలు లభించని పరిస్థితి ఉత్పన్నం అవుతుందన్నారు. సాగునీటి వనరులు, ఖనిజ సంపద కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలు తీరుతాయని ఉద్యమంలో పాల్గొని ప్రాణాలర్పిస్తే తెరాస ప్రభుత్వం లేనిపోని సమస్యలు సృష్టించి ప్రజలను తికమకపెడుతోందన్నారు. ఈవిషయంలో మంత్రి జోగురామన్న ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి మంత్రి పదవికి రాజీనామా చేసి తెరాస అధినాయకత్వానిపై ఒత్తిడి తేవాలన్నారు. తాను రాజీనామా చేసి ప్రజల పక్షాన నిలబడి ఉద్యమంలో నిలబడితే ఆయన్ను తిరిగి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకొంటామన్నారు.ఇప్పటికైనా అధికారులు జిల్లాలోని గిరిజనుల సంక్షేమాన్నిదృష్టిలో ఉంచుకొని ఉట్నూర్‌ కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు.