ఉత్తరాంధ్రపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ – తోటపల్లి రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలి

– కళా వెంకటరావు డిమాండ్‌
శ్రీకాకుళం, జూలై 27 : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉత్తరాంధ్రపై కపట ప్రేమ వలబోస్తుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కళా వెంకటరావు విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రాకు చెందిన మూడు జిల్లాలు వెనుకబాటుకు గురయ్యాయని అన్నారు. పాలకొండ డివిజన్‌ కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తోటపల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి 40 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు 18వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ మూడు జిల్లాలకు ఏకైక ప్రాజెక్టు అయినా తోటపల్లి రిజర్వాయర్‌కు 40కోట్ల రూపాయలు కేటాయించడం ఉత్తరాంధ్రపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను తెలియజేస్తుందని అన్నారు. దామాషా పద్దతి ప్రకారం ఈ ప్రాజెక్టుకు 200 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని అన్నారు. 40 కోట్ల రూపాయలు ఎందుకు సరిపోతాయో ప్రభుత్వం మరో మారు ఆలోచించాలని అన్నారు. తక్షణం పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి వచ్చే ఏడాది జూన్‌ నాటికి రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. తోటపల్లి కాల్వల ఆధునీకరణ, జంపరకోట రిజర్వాయర్‌ పనుల నిర్మాణానికి తక్షణం నిధులు మంజూరు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రులు జిల్లాలో పర్యటిస్తున్న ఒరిగేదేమిలేదని అన్నారు. 2006 ముఖ్యమంత్రి హోదాలో ఎం- సింగ్‌పురం వచ్చిన వైఎస్‌ జంపకోట రిజర్వాయర్‌ను, 2010లో నవగాం వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య తోటపల్లి ఆధునీకికరణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ చాతల్లో చూపలేదని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాటలో రైతులకు సంబంధించి మూడు అంశాలపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయనతో పాటు టి.వెంకటేశ్వరరావు, పాండురంగ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు