ఉత్తరాదిని వీడని భారీ వర్షాలు

ఢిల్లీలో భారీ వర్షం

ముంబై-గోవా రహదారిపై విరిగిపడ్డ కొండచరియలు

ముంబయి,జూలై5(జ‌నం సాక్షి ): దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలకు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరాదితోఎ పాటు మహారాష్ట్రలో భారీగా వర్షాలు పడుతున్నాయి. వరదల ధాటికి లోతట్టు ప్రాంతాలు నీటమునగడం, వీధులు నదులను తలపిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఢిల్లీలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ తీగలు తెగి రోడ్ల విూద పడ్డాయి. దీంతో ఢిల్లీలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. గురువారం ఉదయం ముంబయి-గోవా ప్రధాన రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండచరియల కారణంగా హైవేపై కిలోవిూటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయ్‌గఢ్‌లోని మహద్‌ ప్రాంతంలో ముంబయి-గోవా హైవేపై గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రద్దీగా ఉండే ఈ హైవేపై కొండచరియలు పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటన జరిగిన ప్రాంతానికి అటూ ఇటూ దాదాపు 7 నుంచి 8 కిలోవిూటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గంటల పాటు వాహనదారులు హైవేపై నిరీక్షించాల్సి వచ్చింది. సమాచారమందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మధ్యాహ్నానికి రహదారిపై ఒక లైన్‌ను క్లియర్‌ చేసినప్పటికీ.. వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మంగళవారం అంధేరీలోని ఓ పాదచారుల వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే.