ఉత్తరాది వారికి అందుబాటులో శ్రీవారు

కురుక్షేత్రలో అతిపెద్ద వెంకటేశ్వర ఆలయం

న్యూఢిల్లీ,జూలై2(జ‌నం సాక్షి): ఉత్తర భారతదేశంలో అతిపెద్ద వెంకటేశ్వర ఆలయం హర్యాణాలోని కురుక్షేత్రలో నిర్మించడంతో పర్యాటకంగా దీనికి మరింత ప్రాధాన్యం పెరగనుంది. అలాగే తిరుమలకు వచ్చే వీలుకాని వారు ఇక్కడ స్వామిని దర్శించుకునే అవకాశం వచ్చిందిని టిటిడి జెఇవో పోలా భాస్కర్‌ అన్నారు. సువిశాల ప్రాంగణంలో నిర్మల్‌ సేథియా ఫౌండేషన్‌ సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన ఈ ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠాపన, శ్రీవారి కల్యాణం ఘనంగా జరిగాయి. ఏపీ క్రీడా, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, తితిదే జీఈఓ పోలా భాస్కర్‌, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఈ కర్యాక్రమంలో పాల్గొన్నారు. హర్యాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటు పర్యాటకులకు ఇటు భక్తులకు ఉత్తర భారతంలో ఒక ప్రముఖ కేంద్రంగా ఇది మారనుందన్నారు. రుషికేష్‌, దిల్లీల్లో తితిదే ఆలయాలు ఉన్నాయి. ఆ రెండింటికంటే పెద్ద ఆలయం ఇదే. ఆలయ నిర్మాణానికి ఆరేళ్ల సమయం పట్టింది. పవిత్ర బ్రహ్మసరోవర్‌కు సవిూపంలో 5.52 ఎకరాలల్లో దీన్ని నిర్మించారు. మొత్తం రూ.34 కోట్లతో ఈ ఆలయ నిర్మాణ పనులు చేపట్టగా ఇప్పటివరకూ రూ.18 కోట్లను ఖర్చు చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. విగ్రహప్రతిష్ఠ మ¬త్సవం, స్వామివారి కల్యాణోత్సవంలో హరియాణా, పంజాబ్‌లో ఉన్న తెలుగు వారితో పాటు, దిల్లీ నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరాది వారికి ఇదో వరమని పోలా భాస్కర్‌ అన్నారు.

——–