ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్లాస్టిక్‌పై నిషేధం!

– జులై 15నుంచి అమల్లోకి
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
లఖ్నో, జులై6(జ‌నం సాక్షి) : దేశంలోని ఒక్కోరాష్ట్రం ప్లాస్టిక్‌పై నిషేదం విధిస్తున్నాయి. ప్లాస్లిక్‌ కారణంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లితుందన్న ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్లాస్టిక్‌పై నిషేదం విధించారు. ఇటీవల మహారాష్ట్రలో ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 15నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ‘ప్రజలు జులై 15 నుంచి అన్ని చోట్లా ప్లాస్టిక్‌ కవర్లు, కప్పులు, గ్లాసులు వాడటం మానేస్తారని ఆశిస్తున్నానని, ఈ నిషేధాన్ని అమలు చేయడానికి ప్రజలందరి సహకారం అవసరం అని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. పాలిథిన్‌ కవర్లు, డిస్పోజబుల్‌ గాస్లులు, ప్లేట్లు, నీళ్ల బాటిళ్ల కారణంగా పర్యావరణం విపరీతంగా కలుషితమవుతున్న సంగతి తెలిసిందే.
గత నెలలో జూన్‌ 23న మహారాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. కాగా, చిన్న వ్యాపారులకు, రిటైలర్లకు ప్రభుత్వం ఎ/-లాస్టిక్‌ కవర్ల వినియోగం విషయంలో మినహాయింపు ఇచ్చింది. కిరాణా షాపులు, ఇతర సాధారణ దుకాణాలలో ధాన్యాలు, తదితర వస్తువులు ప్యాక్‌ చేయడానికి ప్లాస్టిక్‌ కవర్లు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే కవర్‌ మందం 50 మైక్రాన్స్‌ కంటే ఎక్కువ ఉండాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తోంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్లాస్టిక్‌పై సమరాన్ని మోగించింది. జులై 15 నుంచి ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించే వారిపై జరిమానాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు అర్థం చేసుకొని ప్లాస్టిక్‌కు దూరంగ ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.