ఉద్రిక్తతలకు దారితీసిన నల్లా వివాదం

ఔరంగాబాద్‌లో ఘర్షణలు: ఇద్దరు మృతి
ఔరంగాబాద్‌,మే12(జ‌నం సాక్షి ):  నీటి కనెక్షన్ల విషయమై రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఔరంగాబాద్‌ ప్రాంతం అల్లర్లతో అట్టుడికిపోయింది. తొలుత మోటికారంజా ప్రాంతంతో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అక్కడ అక్రమ నీటి కనెక్షన్లపై స్థానిక మున్సిపాలిటీ అధికారులు డ్రైవ్‌ చేపట్టారు. అందులో భాగంగా ఓ మతానికి సంబంధించిన ప్రదేశంలో కనెక్షన్‌ను తొలగించారు. దీంతో ఆ వర్గం వారు ఆందోళన చేపట్టారు. పక్కనే ఉన్న వేరే మతానికి చెందిన ప్రదేశంలోనూ ఇలాంటి కనెక్షనే ఉందని, దాన్ని కూడా తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇవి కాస్తా ఔరంగాబాద్‌ అంతటికీ వ్యాపించాయి. రాత్రి 10 గంటల నుంచి మొదలైన అల్లర్లు తెల్లవారుజాము వరకూ సాగాయి.
ఆందోళనకారులు 50 దుకాణాలకు, పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఘర్షణల నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా.. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి అల్లరిమూకలను చెదరగొట్టారు. పరిస్థితి చేజారకుండా 144 సెక్షన్‌ను విధించారు. ప్రస్తుతం ఔరంగాబాద్‌లో అల్లర్లు సద్దుమణిగాయని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో ఇప్పటివరకూ ఇద్దరు మృతిచెందగా, 40 మందికిపైగా గాయపడ్డారు. ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆందోళనకారులు సుమారు 40 వాహనాలకు నిప్పంటించారు. విూడియాకు అందిన వివరాల ప్రకారం నిన్న ఔరంగాబాద్‌లో నల్లా కనెక్షన్‌ తొలగించిన ఉదంతంలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవ తీవ్రస్థాయికి చేరింది. చూస్తున్నంతలోనే అల్లరి మూకలు దుకాణాలపై రాళ్ల దాడికి దిగారు. పలు వాహనాలకు, దుకాణాలకు నిప్పంటించారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ హింసాయుత ఘటనల్లో ఔరంగాబాద్‌ పట్టణ అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవర్థన్‌తో పాటు 15 మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారు. కాగా ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని మహారాష్ట్ర ¬ంశాఖ మంత్రి దీపక్‌ కేశర్‌కర్‌ తెలిపారు. ప్రజలెవరూ వదంతులను నమ్మవద్దని కోరారు.
—–