ఉధృతమవుతున్న లాయర్ల ఆందోళన

4

– నేడు ఇందిరాపార్కువద్ద ధర్నా

– మరో నలుగురి సస్పెన్షన్‌

హైదరాబాద్‌,జూన్‌ 30(జనంసాక్షి):తెలంగాణ న్యాయవాదులు చేస్తోన్న ఆందోళన ఉధృత రూపం దాల్చింది. మరోవైపు రంగారెడ్డి కోర్టులో మరో నలుగురిపై హైకోర్టు సస్పెనషన్‌ వేటు వేసింది. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును వెంటనే విభజించాలని, తెలంగాణకు కేటాయించిన ఆంధ్రా న్యాయమూర్తులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, హైకోర్టు సస్పెండ్‌ చేసిన తెలంగాణ న్యాయమూర్తులపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ న్యాయవాదులు ఆందోలనకు దిగారు.  తెలంగాణలోని పలు న్యాయస్థానాల్లో అడ్వొకేట్స్‌ తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. ఎక్కడికక్కడ కోర్టు విధులను బహిష్కరిస్తున్నారు. ఈమేరకు రేపు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేపట్టాలని తెలంగాణ అడ్వొకేట్స్‌ జేఏసీ నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నాను నిర్వహించనున్నారు. ఈ మహాధర్నాలో పది జిల్లాల నుంచి పెద్ద ఎత్తున న్యాయవాదులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీ అడ్వొకేట్స్‌ జేఏసీ విజ్ఞప్తి చేసింది. కాగా, ఈ ధర్నాలో అఖిలపక్ష నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించనున్నారు.  క్రమశిక్షణ ఉల్లంఘన కింద నలుగురు న్యాయశాఖ ఉద్యోగులపై హైకోర్టు సస్పెన్షన్‌ వేటు వేసింది.న్యాయాధికారుల విభజనను నిరసిస్తూ ఆదివారం న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులు హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సోమవారం ఇద్దరు న్యాయాధికారులను, మంగళవారం మరో తొమ్మిది మంది న్యాయాధికారులను సస్పెండ్‌ చేసింది. దీనికి కొనసాగింపుగా గురువారం నలుగురు న్యాయశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. వరంగల్‌ జిల్లా కేంద్రంలో న్యాయవాదుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి  ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలను ఉద్ధృతం చేశారు. హన్మకొండలోని జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. అప్షన్ల పేరుతో తెలంగాణలో సీమాంధ్ర న్యాయమూర్తులు, న్యాయాధికారుల కేటాయింపులను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. స్థానికత ఆధారంగానే తెలంగాణ, సీమాంధ్ర న్యాయమూర్తులను విభజన చేయాలని కోరారు.