ఉపరాష్ట్రపతి ఎన్నికకు టీడీపీ దూరం : చంద్రబాబు
హైదరాబాద్, ఆగస్టు 5 (జనంసాక్షి ): ఈ నెల 7వ తేదీన జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆదివారం నాడు చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన టిడిపి పార్లమెంట్ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 8వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై టిడిపిపి సమావేశం చర్చించింది. గ్యాస్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, విద్యుత్ కోతలు, రైతాంగ సమస్యలు, ధరల పెరుగుదల వంటి అంశాలపై ప్రభుత్వాని నిలదీయాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించే నాథుడే లేడని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కరవు మండలాలకు కేంద్రం నుంచి రావాల్సిన సహాయంపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎంపిలకు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ పార్లమెంట్ సమావేశం ప్రారంభంలోనే ప్రభుత్వ తీరును ఎండగట్టాలని సూచించారు. రాష్ట్రం నుంచి గ్యాస్ తరలింపుపై సభను స్తంభింపజేయాలని సమావేశం నిర్ణయించింది. ప్రజా సమస్యలపై వెనక్కు తగ్గకుండా పోరాడాలని చంద్రబాబు సూచించారు. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని ఆయన సూచించారు. ఈ భేటీకి రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ, సిఎం రమేష్, టి.దేవేందర్‌గౌడ్, కె.నాగేశ్వరరావు, లోక్‌సభ సభ్యులు నామా నాగేశ్వరరావు, రమేష్‌రథోడ్, తదితరులు హాజరయ్యారు.