ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించాలి
వినుకొండ, జూలై 19 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించాలని ఎంపిడిఓ జి. ఆచారి అన్నారు. మండల కేంద్రమైన నూజెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పనులు జరగని గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని ఆయన సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి కూలీకి పని కల్పించాలని ఆచారి అన్నారు. పనులు చేపట్టే విషయంలో రాజీపడేది లేదని, పనులు నాణ్యతగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.