ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కెసిఆర్‌ ప్రచారం

26న రానున్న టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌

ఇంటింటా ప్రచారంతో జోరుపెంచిన గులాబీనేతలు

కరీంనగర్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటన ఖరారైంది. ఈ నెల 26న కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాలకు కలిపి సభ జగిత్యాలలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభలు ఉంటాయి. ఆ తరువాత 2:45 గంటలకు కరీంనగర్‌, మానకొండూర్‌ నియోజకవర్గాలకు కలిసి కరీంనగర్‌లో ఉమ్మడి సభ ఉంటుంది.ఈ మేరకు టిఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటా ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ కలుస్తూ.. ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు కదులుతున్నారు. చేసిన అభివృద్ధిని చెప్తూ.. చేయబోయే పనుల గురించి వివరిస్తూ.. కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గులాబీ సేన ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నది. గడపగడపకూ వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తూ జోరు పెంచుతున్నది. గంగుల కమలాకర్‌, రసమయి బాలకిషన్‌ మానకొండూర్‌ గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. మరో వైపు హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ సమక్షంలో వివిధ పార్టీల నుండి టీఆర్‌ఎస్‌లో భారీగా చేరారు. వృద్ధులు,

మహిళలు, యువతీ యువకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఆయా డివిజన్ల నాయకులు, కార్యకర్తలు వెంటరాగా కమలాకర్‌ ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మంద ఉమాదేవి మంత్రి ఈటలకు మద్దతుగా పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తామని మంత్రి ఈటెల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లా తెలంగాణకు గుండె కాయలాంటిదనీ, ఉద్యమానికి ఊపిరులు ఊదిందని ఉద్ఘాటించారు. నాడు ఉద్యమాన్ని, నేడు అభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి ఓట్లు ఎలా వేస్తారని ప్రశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, మానకొండూర్‌ లాంటి మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలం కావాలన్నా మరో సారి కేసీఆర్‌ను సీఎంను చేయాలని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి నుంచే చంద్రబాబుకు దాసోహం అంటున్నదనీ, మహాకూటమిలో టికెట్ల కేటాంపులోనే సంక్షోభం నెలకొన్నదని, ఇలాంటి కూటమి పాలన ఎలా సాగిస్తుందని మంత్రి ప్రశ్నించారు.