ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌లో పెరిగిన ఆశావహులు

టిక్కెట్ల కోసం భారీగా దరఖాస్తులు
పొత్తులు తేలితేనే స్పష్టత వచ్చే అవకాశాలు
కరీంనగర్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): కారు దూకుడును అడ్డుకోవాలంటే అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు పక్రియను కూటమి రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయడం అత్యవసరమని కాంగ్రెస్‌ సహా కూటమి నేతలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయా పార్టీల నేతలు తమ అగ్రనేతలకు తెలియచేస్తున్నారు. కూటమి సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు కాంగ్రెస్‌, టీ టీడీపీ, సీపీఐ, కోదండరాం నేతత్వంలోని టీజేఎస్‌ ప్రాథమిక అవగాహనకు వచ్చాయి. ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యేనాటికి ఈ కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పోటీ చేసే శాసనసభ స్థానాల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్‌లో దాదాపుగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే  13 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే 61 మంది టికెట్ల కోసం డీసీసీ, టీ పీసీసీలకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కాం/-గరెస్‌లో పోటీ పెరిగింది. సీనియారిటీ, లాబీయింగ్‌, ప్రజాబలం తదితర అంశాల ప్రాతిపదికన అభ్యర్థుల ప్రకటనపై కూడా కాంగ్రెస్‌ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. 10 స్థానాలపై కసరత్తు పూర్తి చేసిన అధిష్టానం.. మరో మూడు స్థానాలపై ఆచీతూచీ వ్యవహరిస్తోంది. ఒకటి, అర
మార్పులతో జాబితాను త్వరలోనే ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే నాటికి నియోజకవర్గానికో భారీ బహిరంగ సభ, అభ్యర్థుల మూడు విడతలుగా నియోజకవర్గాన్ని చుట్టే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానాలు, బలాబలాలు, అభ్యర్థులపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి 13 స్థానాలకు అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు.  మరోవైపు కూటమి పార్టీలైన టీజేఎస్‌ మూడు, సీపీఐ ఒకటి, టీటీడీపీ రెండు స్థానాలపై గురి పెట్టినట్లు ఆయా పార్టీల జిల్లా నాయకత్వం
ప్రతిపాదనలుగా క్యాడర్‌ ముందుపెడుతోంది. ఒకవేళ ఆయా పార్టీలు చేసిన ప్రతిపాదనలకు ఒకే అంటే కాంగ్రెస్‌ పార్టీకి మిగిలేది ఏడు స్థానాలే. అలాంటప్పుడు అసలే కుదరదని టీజేఎస్‌, టీ టీడీపీ, సీపీఐకి తలా ఒక్కటి ఇస్తే ఎక్కువేనని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. ఇలా ఓ వైపు కూటమి పార్టీల్లో రకరకాలుగా చర్చ జరుగుతుండగా.. ఇంకోవైపు ఎవరికివారుగా టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తుండటం చర్చనీయాంశ మవుతోంది. తొలిసారిగా కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహనకు సిద్ధమైన టీ టీడీపీ మొదటి నుంచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కనీసం రెండుస్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇనుగాల పెద్దిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ హుజూరాబాద్‌, జగిత్యాల నుంచి పోటీచేసే అవకాశం ఉందంటున్నారు.  అదే విధంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పోటీకీ ఆసక్తిగా ఉన్నారు. టీజేఎస్‌ కనీసం మూడైనా ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. హుజూరాబాద్‌, రామగుండం, సిరిసిల్ల.. లేదంటే కరీంనగర్‌, హుజూరాబాద్‌, రామగుండం ఇవ్వాలని అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.