ఉమ్మడి నిజామాబాద్‌లో టిఆర్ఎస్ మళ్లీ విజయం సాధించాలి
అందరినీ గెలిపించుకోవాల్సి ఉంది
తెలంగాణపై కుట్రలు చేస్తున్న వారిని దూరం పెట్టాలి
విూడియా సమావేశంలో ఎంపి కవిత
నిజామాబాద్,నవంబర్15(జనంసాక్షి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలుపించుకోవాలని ప్రజలకు ఎంపి కవిత పిలుపునిచ్చారు. కూటమి ఇప్పటికీ అభ్యర్థులను తేల్చలేకపోతుందని, కూటమి పేరుతో కాంగ్రెస్ నాయకులు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. గురువారం ఆమె విూడియాతో మాట్లాడుతూ ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ దూసుకపోతుందన్నారు. పేరుకే ప్రజాకూటమి అని.. కూటమిలో ప్రజలే లేరని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పలు గ్రామాలను సస్యశ్యామలం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 65 వేల 200 మందికి పెన్షన్, 4809 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా రూ. 30 కోట్ల 87 లక్షల రూపాయలను ఆడపడుచులకు కానుకగా ఇచ్చామని వెల్లడించారు. యాదవ కులస్థులకు 5 వేల 51 మందికి 47 కోట్ల 30 లక్షల రూపాయలతో గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 113 కోట్ల ఖర్చుతో 252 చెరువులను బాగుచేసుకున్నామని తెలిపారు. ఇకపోతే ఎమ్మెల్సీ భూపతిరెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన పదవిని ఆయన వదులు కోవాలన్నారు. ఎంపి డి. శ్రీనివాస్‌పై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చంద్రబాబుతో పొత్తు ఎందుకో కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. కూటమి కుట్రలను ప్రజలు గమనించాలని కోరారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న వారినే మళ్లీ గెలిపించాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని ఎంపీ కవిత అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తమ ఉనికిని కోల్పోతామన్న భయంతోనే ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయని విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల నిర్మాణం, హైకోర్టు విభజన జరుగకుండా ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ఎంపీ కవిత మండిపడ్డారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ దీక్షా దక్షతతో ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారని చెప్పారు.