ఊరు వాడ ఒక్కటై.. నవంబర్ ఫస్ట్‌ను ఛీకొట్టిన తెలంగాణ
ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం
కోదండరాం హౌస్ అరెస్ట్
తెలంగాణలో అప్రకటిత ఎమర్జోన్సీ
ఓయూలో ఉద్రిక్తత
అన్ని ప్రభుత్వ కార్యలయాలపై నల్లజెండా
నాగం అరెస్టు
గన్ పార్కు వద్ద భారీ నిరసన
హైదరాబాద్, నవంబర్ 1 (జనంసాక్షి):
రాష్ట్రావతరణ దినోత్సవాన్ని గురువారంనాడు తెలంగాణ వాదులు ఉద్రిక్తతల మధ్య విద్రోహ దినంగా పాటించారు. తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మళ్లీ రణరంగంగా మారింది. పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. విద్యార్థులు ఆర్ట్స్ కాలేజ్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తార్నక వైపు ఆర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఓయు ఆర్ట్స్ కాలేజీపై ఓయు జెఎసి విద్యార్థులు నల్లజెండాలు ఎగరవేసి నిరసనలు తెలిపారు. ఛలో ఎన్టీఆర్ గార్డెన్ పిలుపుతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఎన్‌సిసి గేట్ వద్ద అడ్డుకోవడంతో విద్యార్థులు వాగ్వివాదానికి దిగారు. దీనితో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. వారిపైకి విద్యార్థులు రాళ్లు విసిరారు. విద్యార్థులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు గన్‌పార్క్ వద్ద ధర్నా చేస్తామన్న టిజెఎసి పిలుపుతో జెఎసి ఛైర్మన్ కోదండరాంను పోలీసులు గురువారం ఉదయమే హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్దే నల్లజెండా ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. కోదండరాం ఇంటి వద్ద తెలంగాణ నగారా సమితి కన్వీనర్ నాగం జనార్దన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని కోదండరాం గన్‌పార్క్ వైపు జెఎసి నాయకులతో కలిసి వెళ్లారు. గన్‌పార్క్ వద్ద ఉద్యోగ సంఘాల జెఎసి, తెలంగాణ లోక్‌దళ్ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండాలు ఎగరవేశారు. వరంగల్‌లో పోలీసు హెడ్ క్వార్ట్‌ర్స్‌ను ముట్టడించేందుకు
టిఆర్‌ఎస్ శాసన సభ్యుడు వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తుండగా, పోలీసులు అడ్డుకోవడంతో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముందు తెలంగాణ వాదులు బైఠాయించారు. దీనితో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులు వినయ్ భాస్కర్‌తో సహా పలువురిని అరెస్టు చేశారు. నిజామాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న జెఎసి, జర్నలిస్టులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో స్థానిక శాసన సభ్యుడు జూపల్లి కృష్ణారావు తహశీల్దార్ కార్యాలయంపై నల్లజెండ, టిఆర్‌ఎస్ జెండాను ఎగరవేశారు. నల్గొండ జిల్లా సూర్యపేట్‌లో తెలంగాణ వాదులు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టులను బహిష్కరించి నల్లజెండాలను ఎగరవేశారు. కరీంనగర్ జిల్లాలో ఈటెల రాజేందర్, నారదాసు లక్ష్మణరావు నాయకత్వంలో భారీ ప్రదర్శనలు నల్లజెండాలు ఎగుర వేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల తెలంగాణ వాదులు బ్లాక్ డేను పాటించారు.
జెఎసి ఛైర్మన్ కోదండరాంను పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో ఆయన జెఎసి నాయకులతో కలిసి తన ఇంటిపైనే నల్లజెండాలు ఎగరవేసి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని నిరసన తెలిపే హక్కును కూడా హరించడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తోంది అంటూ మండిపడ్డారు. ఒక వ్యక్తిని నిర్భందించేందుకు ఇంత పెద్ద ఎత్తున పోలీసులను ఏర్పాటు చేయడం అవసరమా అంటు ప్రశ్నించారు. ప్రభుత్వం ఎంత నిర్బంధించినా ఉద్యమాన్ని ఆపేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం : కోదండరామ్
హైదరాబాద్, నవంబర్ 1 (ఎపిఇఎంఎస్): ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ విమర్శించారు. గురువారం రా ష్ట్ర అవతరణ వేడుకలకు నిరసనగా అసెంబ్లీకి ఎదురుగా ఉన్న తెలంగాణ ఆమరవీరుల స్థూపం వద్ద నిరసనలు తెలిపేందుకు బయలుదేరిన కోదండరామ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసుల చర్యపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్య్తం చేశారు. రాష్ట్రావతరణ వేడుకలకు నిరసనగా కోదండరామ్‌తో పాటు తెలంగాణవాదులు నల్లజెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ చట్టబద్ధంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. ఏమర్జెన్సీ రోజులను తలపించే విధంగా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు తెలంగాణవాదులకు హక్కు లేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని డిమాండ్ చేశారు. నిర్బంధాల వల్ల, అరెస్టుల వల్ల ఉద్యమాన్ని ఆపలేరని కోదండరామ్ హెచ్చరించారు. సమైక్యవాదుల పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు.
కోదండరామ్‌కు మద్దతు పలికేందుకు వచ్చిన తెలంగాణ నగారా సమితి సమితి కన్వీనర్ నాగం జనార్దన్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాగం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యం ఉందా అన్ని ప్రశ్నించారు. గతంలో ఎమర్జెన్సీ ఉన్నరోజుల్లో కూడా ఇంతటి విపత్కర పరిస్థితి లేదని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ఆయన అన్నారు. కోదండరామ్‌ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం పరదాలు కట్టి రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకుంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రావతరణ వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రభుత్వానికి వినాశకాలం దాపురిస్తుందని నాగం ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు. పోలీసులు నాగంను అక్కడినుండి కాచిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ నాగం అక్కడే నిరసన కార్యక్రమం చేపట్టారు.