ఎంఐఎం కీలకం

హైదరాబాద్‌,డిసెంబరు 4(జనంసాక్షి):

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ కీలకం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో అధికార తెరాస 99 డివిజన్లలో విజయం సాధించింది. దీంతో మేయర్‌ పీఠం తెరాస వశమైంది. అప్పట్లో ఎక్స్‌అఫిషియో ఓట్ల అవసరం రాలేదు. ఈ సారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ ¬రా¬రీగా సాగడం.. అధికార పార్టీ స్థానాలు తగ్గడంతో మజ్లిస్‌ కీలకం కానుంది. ఆ పార్టీకి ప్రస్తుతం గెలిచిన కార్పొరేటర్లతో పాటు అదనంగా 10 ఎక్స్‌అఫిషియో సభ్యులున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసినప్పటికీ.. తెరాసకు ఇన్నాళ్లు మజ్లిస్‌ మిత్రపక్షంగా ఉంది. అదే మైత్రిని కొనసాగించి మేయర్‌ ఎన్నిక విషయంలో తెరాసకు సహకరిస్తుందా..? మేయర్‌ పీఠం కోసం పట్టుబడుతుందా? అనేది ఆసక్తికరం.

మజ్లిస్‌.. ఒకప్పుడు కేవలం హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతానికే పరిమితమైన పార్టీ. ఇప్పుడు దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. ఇటీవల బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించిన ఆ పార్టీ.. అదే ఉత్సాహంతో ఈ సారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో దిగింది. గత ఎన్నికల్లో తెరాసతో పొత్తుతో పోటీలో నిలిచిన ఏఐఎంఐఎం.. ఈ సారి సింగిల్‌గానే పోటీ చేసింది. గతంతో పోలిస్తే (44) ఈ సారి ఒక్క డివిజన్‌ కోల్పోయినప్పటికీ 43 చోట్ల సత్తా చాటింది. పాతబస్తీలో తనకు ఎదురులేదని నిరూపించుకుంది. ఇక్కడ పాగా వేయాలన్న అధికార తెరాస, భాజపా ప్రయత్నాలను అడ్డుకోగలిగింది.పాతబస్తీ ప్రాంతం హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో విస్తరించి ఉంది. దీని పరిధిలో 43 కార్పొరేటర్‌ డివిజన్లు ఉన్నాయి. 1959లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఉప ఎన్నికలో ఇద్దరు కార్పొరేటర్లతో మొదలైన మజ్లిస్‌ ప్రస్థానం.. 2015 ఎన్నికల్లో 44కు చేరింది. గత ఎన్నికల్లో మజ్లిస్‌, తెరాస, భాజపా-తెదేపా (కూటమి) మధ్య పోరు నడిచింది. ఈ సారి మజ్లిస్‌, తెరాస, భాజపా మధ్య త్రిముఖ పోరు సాగింది. మొత్తం 51 స్థానాల్లో మజ్లిస్‌ బరిలో నిలిచింది.జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ప్రధానంగా పాతబస్తీ కేంద్రంగా నడిచాయనడంలో సందేహం లేదు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ మధ్య మాటల యుద్ధాలు నడిచాయి. పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామంటూ బండి సంజయ్‌ వ్యాఖ్యానించడం వివాదానికి తావిచ్చింది. పాకిస్థాన్‌, రోహింగ్యాలు ఓట్లు వేస్తున్నారంటూ ఆయన పాతబస్తీని లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి తోడు ¬ంమంత్రి అమిత్‌షా, బండి సంజయ్‌ వంటి నేతలు వ్యూహాత్మకంగా చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించడం పాతబస్తీలో రాజకీయ వేడిని పెంచింది. మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ సైతం హుస్సేన్‌సాగర్‌ వద్ద ఉన్న మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు సమాధులను కూల్చేయాలని, ట్యాంక్‌బండ్‌పై ఉన్న విగ్రహాలనూ తొలగించాలని వ్యాఖ్యానించడంతో వివాదం రాజుకొంది. అటు తెరాస, ఎంఐఎం సైతం పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఇలా తెరాస, భాజపా.. పాతబస్తీలో పాగా కోసం ప్రయత్నించినా మజ్లిస్‌ దూకుడును నిలువరించలేకపోయాయి. అయితే, భాజపా దూకుడు మరోచోట ఆ పార్టీకి ఉపయోగపడింది.