ఎండల తీవ్రతతో కూలీల ఆందోళన


బయటకు రావడానకే జంకుతున్న జనం
ఆదిలాబాద్‌,మే21(జ‌నంసాక్షి):  ఎండల తీవ్రత విపరీతంగా ఉండడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే వేడి విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ప్రతీరోజు 46 డిగ్రీలు దాటి వేడిమి ఉండటంతో తప్పని సరిగా బయటకు వచ్చే వారు ముఖానికి మాస్కులు ధరించి మరి వస్తున్నారు. దినసరి కూలీలు, కార్మికులు ఎండల వేడిమితో నానా అవస్థలు పడుతున్నారు. ఉపాధి హవిూ పనులు చేసే కూలీలు తొమ్మిది గంటల వరకే తమ పనులను పూర్తి చేసుకుని వెనుదిరుగుతున్నారు. వడదెబ్బతో ఉపాధి హవిూ కూలీలు ఎక్కువగా చనిపోతుండడంతో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. వోఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రజలు ఎండల నుంచి ఆరోగ్యం కాపాడుకోవాలని, అత్యవసరమైతేనే
బయటకు వెళ్లాలని వైద్యులు పేర్కొంటున్నారు. మూడు రోజుల వ్యవధిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈసారి జూన్‌ మొదటి తేదీ నాటికి తెలంగాణ ప్రాంతానికి రుతుపవనాలు చేరుకోనున్నాయనేది ప్రజల్లో ఆనందం కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో
ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెరువుల్లో చేప పిల్లలను పెంచుతుండగా పెరుగుతున్న ఎండతీవ్రతకు చేపలు మృత్యువాతపడుతున్నాయి. చెరువుల్లో టన్నుల కొద్దీ చేపలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. మత్స్యకారులకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వృధాగా పోతోంది.