ఎంతోమంది మహనీయుల త్యాగం వల్లే మన దేశానికి స్వతంత్రం వచ్చింది

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 14 (జనం సాక్షి); ఎంతో మంది మహనీయుల త్యాగాలవల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటున్నామని, రేపటి తరాలవారికి మంచి సందేశాన్ని ఇచ్చే 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలభవన్ లో 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల లో బాగంగా జరిగిన జానపద కళాకారుల ప్రదర్శన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బి ఎస్ కేశవ్ గార్లతో కలిసి జ్యోతిని వెలిగించి ప్రదర్శనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మనం స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనలేదు ఎందరో మహనీయులు త్యాగాలు చేయడం వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకునే విధంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నమని ఆమె తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని మీపైనే దేశం ఆధారపడిందని ఆమె తెలిపారు.
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ కుల మతాలకతీతంగా వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. ఎంతో మంది మహనీయుల త్యాగ పలమే స్వతంత్రం వచిందని , భావితరాల వారికి గుర్తుండిపోయే విధంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు. మన కళలను మరచిపోకుండా జానపద కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని కలెక్టర్ అన్నారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత దేశభక్తిని పెంపొందించుకొని అడుగులు ముందుకు వేయాలన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా తెలంగాణ ప్రభుత్వం 75 వ స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని, ఇంటింటికి జెండాలు పంపిణీ చేసి వజ్రోత్సవాలను నిర్వహిస్తుందన్నారు.
మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ మాట్లాడుతూ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ఈనెల 8 నుండి 22 వరకు జరుగుతున్నాయని, ప్రతి ఇంటికి జెండాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. బాల భవన్ లో నిర్వహించిన జానపద కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని ఆయన తెలిపారు. అంతకుముందు పాత బస్టాండ్ నుండి బాల భవన్ వరకు జానపద కళాకారుల ర్యాలీని జడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లు జండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జడ్పి సీఈవో విజయ నాయక్, డి ఇ ఓ సిరాజుద్దీన్, డి పి ఆర్ ఓ చెన్నమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాబు, సంక్షేమ అధికారి శ్వేత ప్రియదర్శిని, ప్రియాంక సాంస్కృతిక సారధి కళాకారులు, డప్పు, డోలు కళాకారులు, విద్యార్థిని విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.