ఎంపీల పోరును అభినందించిన కోదండరామ్‌


హైదరాబాద్‌, డిసెంబర్‌ 5

తెలంగాణపై నిర్దిష్ట రోడ్డు మ్యాప్‌ లేకుండా కేంద్రం చేసే ప్రకటనలు నమ్మశక్యం కాదని తెలంగాణ జేఏసీ పేర్కొంది. కేవలం ఎంపీల ఒత్తిడి వల్లే అఖిలపక్ష సమావేశం అంటూ తేదీని ప్రకటించినట్టు కనబడుతుందని టిజెఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ఈ నెల 28వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్న కేంద్రమంత్రి షిండే ప్రకటనపై బుధవారంనాడు ఆయన స్పందించారు. కేవలం ఓటింగ్‌లో పాల్గొనేందుకే ఎంపీలను బుజ్జగించేందుకు ఈప్రకటన చేశారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత ఎంపీలు ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని కేంద్రం ఇప్పటికిప్పుడు ఈ ప్రకటన చేయడం వెనుక మతలబ్‌ ఉండి ఉంటుందని ఆయన అన్నారు. సీమాంధ్ర ఎంపీ కావూరితో ప్రధాని మాట్లాడి బుజ్జగించారని తెలంగాణ ఎంపీలతో మాట్లాడేందుకు ఆయనకు మనసు రాలేదని విమర్శించారు. ఇది తెలంగాణ ఎంపీల పట్ల వివక్ష చూపించడమేనని ఆయన అన్నారు. తెలంగాణపై తేదీలతో స్పష్టమైన ప్రకటన చేయించే వరకు ఎంపీలు వెనకడుగు వేయరాదని ఆయన సూచించారు. స్పష్టమైన ప్రకటన లేకుండా తెలంగాణలో అడుగు పెడితే ప్రజలు మీ వెంటపడతారని ఎంపీలను కోదండరాం హెచ్చరించారు. అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశానికి ప్రతీ పార్టీ నుంచి ఒక్క ప్రతినిధి మాత్రమే హజరై అభిప్రాయాన్ని వెల్లడించాలని ఆయన అన్నారు. అఖిలపక్షం పేరుతో కాంగ్రెస్‌పార్టీ మరో కొత్తనాటకానికి తెరలేపిందని టిఆర్‌ఎస్‌ నేత, విశ్లేషకుడు వి.ప్రకాష్‌ అన్నారు. తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో ఓటింగ్‌లో పాల్గొని వస్తే తెలంగాణప్రాంతంలో అడుగు పెట్టలేరని హెచ్చరించారు. అఖిలపక్షంపై షిండే ప్రకటనలు చేసేవరకు ఇలాంటి వార్తలను నమ్మలేమన్నారు. పొన్నం ప్రభాకర్‌, మధుయాష్కీలు మరో కొత్త డ్రామాలకు నాందిపలుకుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఎంపీల మధ్య చీలిక తెచ్చేందుకుకేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు.