ఎగుమతి లక్ష్యంగా వ్యవసాయ విధానం

ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల్లో భారత్‌ వాటాను రెట్టింపు చేయాలని, విదేశీ మార్కెట్లలో ఎగుమతి అవకాశాల ద్వారా రైతులు ప్రయోజనాలు పొందేలా చేయాలనే లక్ష్యాలతో రూపొందించిన ‘వ్యవసాయ ఎగుమతి విధానం-2018’కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సేంద్రియ, శుద్ధిచేసిన ఉత్పత్తులపై అన్ని రకాల ఎగుమతి ఆంక్షల్ని తొలగించనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ ఎగుమతులకు సంబంధించిన అన్ని రకాల అంశాలపైనా ఈ విధానం దృష్టి సారిస్తుందన్నారు. వ్యవసాయ ఎగుమతులు ఏడాదిలో 20 శాతందాకా పెరిగాయన్నారు. ఒకప్పుడు భారత్‌ వ్యవసాయ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునేదని, ఇప్పుడు భారీ స్థాయిలో ఎగుమతి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు తొలిసారిగా తీసుకొచ్చిన ఈ విధానం తోడ్పడుతుందని కేంద్రమంత్రి వెల్లడించారు. వ్యవసాయ ఎగుమతులు ప్రస్తుతం రూ.2.12 లక్షల కోట్లుగా ఉండగా, 2022 నాటికి సుమారు రూ.4.25 లక్షల కోట్లకు పెంచాలనే లక్ష్యంతో దీనిని రూపొందించారు. ఇదో మంచి పరిణామంగా చూడాలి. అయితే ఇందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా రావాలి. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ధరలు, సరఫరా పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు సవిూక్ష జరుగుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్‌ప్రభు తెలిపారు. టీ, కాఫీ, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని పెంచడం, ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో దేశం వాటాను పెంచడం వంటివి ఈ విధానం లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. మౌలిక సౌకర్యాల ఆధునికీ కరణ, ఉత్పత్తుల ప్రామాణీకరణ, నిబంధనల క్రమబద్ధీకరణ, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి సారిస్తుందన్నారు. డిసెంబర్‌ 5ను ప్రపంచ భూసార దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్నా అందుకు అనుగుణంగా కర్యక్రమాలు సాగడం లేదు. కేవలం ప్రచార కార్యక్రమాల తో ప్రజలు, వ్యవసాయ శాఖ సరిపెడుతోంది. ఇటీవల జరిగిన కార్యక్రమాలే ఇందుకు నిదర్శనం. భూమి, పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఏటా ప్రపంచ భూసార దినం నిర్వహిస్తున్నా, కార్యక్రమాలు మాత్రం మొక్కుబడిగా సాగడం వల్ల రైతులు పాత పద్దతిలో సేంద్రియ వ్యవసాయానికి ముందుకు రావడం లేదు. కేంద్రం ఇటీవల సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ప్రకటించినా రైతుల్లో అవగాహన కుదరబం లేదు. భూ పరిరక్షణపై చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల రైతులు ఇబ్బడిముబ్బడిగా ఎరువులను వాడుతున్నారు. భూసా పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోక పోయినా కనీసం హాని కలిగించకుండా రసాయన ఎరువులు వాడకుండా ఉంటే చాలని పర్యావరణ ప్రముఖులు సూచిస్తున్నారు. పర్యావరణం, వాతావరణంతో పాటు ఇటు జీవన శైలీలోను మార్పులతో భూపరిరక్షణపై అవగాహన కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆధునీకరణ కారణంగా భూమి విూద ఉన్న ప్రకృతి సౌందర్యం, సహజవనరులు పూర్తిగా దెబ్బతింటున్నాయి. భూమిని అస్ధిర పరిచే ఇలాంటి అనేక చర్యల కారణంగా మానవమనుగడ ప్రశ్నార్థకం కానుందని హెచ్చరిస్తున్నారు. దురదృష్ట వశాత్తు వ్యవసాయం కోసం విచ్చల విడిగా వాడుతున్న రసాయనాలు భూమిని నిస్సారంగా, నిర్జీవంగా మార్చేస్తున్నాయి. జీవం కోల్పోయిన నేలలో దిగుబడులు నాసిరకంగానే ఉంటున్నాయి. దీర్ఘకాలంలో దిగుబడులు పూర్తిగా తగ్గిపోయి, ఆహార సంక్షోభాలకు దారి తీసే ముంపు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాల వైపు మారడం తప్ప మరో మార్గం లేదని వివరిస్తుంది. భూసారాన్ని కాపాడుకుంటే తప్ప భావితరాలకు భవిష్యత్తు లేదని పదేపదే చెబుతున్నాఆచరాణాత్మక కార్యక్రమాలు లేకపోతున్నాయి. దీనికితోడు రసాయన ఎరువులతో పండించిన పంటలను తినడం వల్ల క్యాన్సర్‌ వంటి రోగాలు సంక్రమిస్తున్నాయని, అనేక ఆధునిక రోగాలకు, అంతుచిక్కని వ్యాధులకు పెస్టిసైడ్స్‌ వినియోగం కారణమని వైద్యులు అంటున్నారు. ఇలాగే వ్యవసాయ విధానం సాగితే మానవ మనుగడ కష్టమని మేధావులు పేర్కొంటున్నారు. మోతాదుకు మించి ఎరువులు, రసాయనాలు వాడడంతో భూమి కలుషితం అవుతుంది. దీంతో భూసారం తగ్గి పంటలు సరైన దిగుబడి ఇవ్వడం లేదు. నేల స్వభావంపై రైతులు అవగాహన కల్గి ఉండం వల్ల మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. భూమిలో తగ్గుతున్న పోషకాలను వివరించడం, భూమి సారవంతాన్ని పెంచే ప్రయత్నం తదితర అంశాలకు సంబంధించి శాస్త్రవేత్తలు రైతులకు వివరిస్తున్నా వాటిని పాటించడం లేదు. ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శాస్త్రీయంగా మట్టి నమూనాలు సేకరించి భూమిలోని స్ధూల పోషకాల గురించి అవగాహన కల్పిస్తున్నా, వాటిని ఆచరించి సేంద్రియ సాగుచేసేలా చూడడం లేదు. వ్యవసాయంలో రసాయనాలు వాడే విధానంకు స్వస్తి పలికినప్పుడే భూమి పరిరక్షణ సాధ్పడుతుందని తెలుస్తుంది. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించడంతో పాటు, వాహనాల వాడకం తగ్గించడం, కార్భాన్‌ ఉద్గారాలను తగ్గించడం, చెత్తను ఎప్పటికప్పుడూ తొలగించడం, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం, ఇంధన వాడకాలను అవసరం మేరకు వినియోగించడం చేయడం ద్వారానే భూమిలో సారవంతం తగ్గకుండా కాపాడుకోవచ్చునని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ఈ దిశగా ప్రచారం ముమ్మరం చేయాలని, రైతులకు నిరంతరంగా అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది.

———-