ఎజెండా లేకుండా చర్చలా?

2
– మాకు ఆసక్తి లేదు

– వేర్పాటువాద నాయకులు

శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పాలన్న ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు వేర్పాటువాదుల రూపంలో భంగం కలుగుతోంది.

అక్కడికి ఇప్పటికే వెళ్లిన అఖిలపక్ష బృందాన్ని కలిసి మాట్లాడి తమ సమస్యలు చెప్పేందుకు వేర్పాటువాదులు అంగీకరించడం లేదు. అసలు చర్చలకు ఒప్పుకోం అని చెబుతున్నారు.

రాష్ట్రంలో సుస్థిర శాంతిపరిస్థితులు నెలకొల్పేందుకు చర్చకు రావాల్సిందిగా అఖిలపక్ష భేటీ సందర్భంగా వేర్పాటువాద నాయకులకు, ఇతర పక్షాలకు ఆహ్వానం పంపగా వేర్పాటువాదులు అందుకు ససేమిరా అంటున్నారు. వేర్పాటువాద నేతలు సయ్యద్‌ అలీ షా గిలానీ, మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌, యాసిన్‌ మాలిక్‌ లు ఉమ్మడిగా ఓ ప్రకటన

విడుదల చేశారు. ముఖ్యమంత్రి ముఫ్తీది మోసపూరిత పనికిమాలిన ఆలోచన అని, ఇంతపెద్ద విషయాన్ని కేవలం చర్చల పేరిట ముందుకు తీసుకెళ్లాలనుకోవడం మూర్ఖపు ఆలోచన అని వారు తీవ్రంగా నిందించారు. అసలు ఏ ఎజెండాతో చర్చలకు వస్తున్నారో కూడా ఇప్పట వరకు తమకు అర్ధం కావడం లేదని ఆరోపించారు. ఈ చర్చలకు తాము ఏమాత్రం ఆసక్తితో లేమని మరొక వేర్పాటువాద నాయకుడు చెప్పాడు.