ఎట్టకేలకు కింగ్‌ ఫిషర్‌ సమ్మె విరమణ

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 25 (జనంసాక్షి): కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ యాజమాన్యనికి, సిబ్బందికి బకాయి వేతనాలపై గురువారం ఒప్పందం కుదరడంతో సమ్మె విరమించేందుకు సిబ్బంది సుముఖత వ్యక్తం చేశారు. దీంతో వచ్చే నెల కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తిరిగి తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించేందుకు సానుకూ లత ఏర్పడింది.  సిబ్బందికి చెల్లించాల్సిన బకాయిలలో మూడునెలల జీతాలను దీపావళి ముందుగా చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించడంతో సిబ్బంది తమ విధులకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారని కింగ్‌ ఫిషర్‌ సిఇఓ సంజయ్‌ అగర్వాల్‌ చెప్పారు. మార్చి నెల జీతాలను 24గంటల్లో చెల్లించేందుకు యాజమాన్యం హామీ ఇచ్చిందన్నారు. మిగిలిన జీతాలను మరో రెండు వారాలలో దీపావళి ముందుగానే చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. అలాగే నాలుగో నెల బకాయి జీతాన్ని డిసెంబర్‌ నెలాఖరులోగా చెల్లిస్తామని యాజమాన్యం అంగీకరించిందని సంజయ్‌ తెలిపారు.  కాగా, సిబ్బంది సమ్మె విరమించి విధులకు హజరై సంస్థకు మద్ధుతు పలికేందుకు అంగీకరించినంతుకు కింగ్‌ఫిషర్‌ చైర్మన్‌ విజయ్‌మాల్యా ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. వేతనాలను చెల్లించాలని గత 25 రోజులుగా పైలెట్లు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.