ఎట్టకేలకు మహిళా ప్రాతినిధ్యం
తెలంగాణలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరిన వేళ రెండు విశేషాలు గమనించవచ్చు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా తమిళ సై సౌందర్యరాజన్ ప్రమాణం చేయడం ఒక విషయమైతే, అదే రోజు సాయంత్రం అమె కొత్త మంత్రులతో ప్రమాణం చేయిచడం మరో విశేషం. నరసింహన్ ఉన్నంత కాలం విస్తరణపై సిఎం కెసిఆర్ ఆలోచించలేదు. ఆయన పోయిన తరవాత మాత్రమే అనూహ్యంగా కేబినేట్ విస్తరణకు ముందుకు వచ్చారు. అదీ కొత్త గవర్నర్‌గా తమిళసై ప్రమాణం చేసిన రోజునే ఎంచుకున్నారు. అలాగే అందులో ఇద్దరు మహిళా మంత్రులను చేర్చారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఓ మహిళా గవర్నర్ రావడం..కేబినేట్‌లోకి ఇద్దరు మహిళలు చేరడం యాదృఛ్చికం కాక మరోటి కాదు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవలే టిఆర్‌ఎస్‌లో చేరిన చేవెళ్ల చెల్లెమ్మకు అనూహ్యంగా మంత్రి పదవి దక్కడం కూడా విశేషం. సీఎం కేసీఆర్ తన కేబినెట్‌ను విస్తరించి, ఖాళీగా ఉన్న ఆరు పదవులను భర్తీ చేయాలనుకున్న దశలో భారీ కసరత్తు చేయడంలో భాగంగా గతంలో ఇచ్చిన హావిూ మేరకు ఇద్దరు మహిళా మంత్రులకు చోటు దక్కడం విశేషం. రాజ్‌భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కొత్తగా ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా సబితా ఇంద్రారెడ్డికి, సత్యవతి రాథోడ్‌కు అవకాశం దక్కడం మహిళలకు దక్కిన ప్రాధాన్యంగా గుర్తించాలి. ఇకపోతే ఖమ్మం జిల్లాకు పువ్వాడ అజయ్‌కుమార్ మంత్రిగా ప్రమాణం స్వీకరించారు. ఆయన కూడా గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన వారే. మొన్నటి ఎన్నికల్లో తిరిగి టిఆర్‌ఎస్ తరఫున ఎన్నికయ్యారు. సిపిఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వర రావు తనయుడిగా పేరుంది. ఖమ్మంలో అంతా మళ్లీ తుమ్మల నాగేశ్వర రావుకు ప్రాధాన్యం ఇస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా పువ్వాడ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే తెరవెనక ఉన్న తుమ్మల నాగేశ్వర రావు ఇప్పుడు మరింతగా తెరమరుగు కావడం ఖాయం. పువ్వాడ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో ఇక రాజకీయంగా ఆ వర్గాలకు పువ్వాడ కేంద్ర బిందువు కాగలరు. ఎస్టీకోటాలె సత్యవతి రాథోడ్ సీటు దక్కించుకున్నారు. గతంలో చందూలాల్ ఈ కోటాలో మంత్రిగా పనిచేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హరీశ్, కేటీఆర్, సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. తమిళనాడు నుంచి వచ్చిన గవర్నర్ తమిళిసై తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయించారు. ‘అను నేను’ పదాన్ని ఆమె తెలుగులోనే పలికారు. తాజా మంత్రుల్లో హరీశ్ రావు, కేటీఆర్ టీఆర్‌ఎస్ తొలి మంత్రివర్గంలోనూ పని చేశారు. మలి విడతలోనూ చోటు లభించింది. కేబినెట్‌లో ఇద్దరు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీలు కాగా.. మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలే! తాజా విస్తరణతో కేబినెట్‌లో ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యంతో కమ్మ, మున్నూరు కాపు మహిళ, ఎస్టీ,కోటాలను భర్తీ చేసినట్లు అయింది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా మహిళలకు కేబినెట్‌లో చోటు దక్కడంతో ఇక విపక్షాల విమర్శలకు అవకాశం లేకుండా పోయింది. టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణగా భావించాలి. గత ఏడాది డిసెంబరు 13న సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేసారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 19న మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలి ఉన్న ఆరు ఖాళీలను ఆదివారం భర్తీ చేశారు. టీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వంలోనూ రెండుసార్లు కేబినెట్ విస్తరణ జరిగింది. అప్పట్లో తొలుత 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మిగిలిన ఆరు స్థానాలను భర్తీ చేశారు.మంత్రివర్గ కూర్పునకు సీఎం కేసీఆర్ భారీ కసరత్తే చేశారని తెలుస్తోంది. ఫిబ్రవరిలో మంత్రులకు కేటాయించిన శాఖల్లో మార్పులు, చేర్పులు చేశారు. తొమ్మిది
నెలలుగా కీలకమైన ఆర్థిక, నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్తు శాఖలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచు కున్నారు. తాజాగా, ఆర్థిక శాఖను హరీశ్ రావుకు, విద్యుత్తు శాఖను జగదీశ్‌రెడ్డికి కేటాయించారు. ఇప్పటి వరకూ జగదీశ్ రెడ్డి నిర్వహించిన విద్యా శాఖను సబితా ఇంద్రారెడ్డికి అప్పగించారు. ఇప్పటికీ జీఏడీ, ప్లానింగ్, లా అండ్ ఆర్డర్‌తోపాటు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సీఎం కేసీఆర్ తన వద్దే ఉంచు కున్నారు. తనయుడు కేటీఆర్‌కు గత ప్రభుత్వంలో నిర్వహించిన ఐటీ, పురపాలన, పరిశ్రమల శాఖలను మళ్లీ కేటాయించారు. ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహమూద్ అలీ, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ శాఖలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదు. వేముల ప్రశాంత్ రెడ్డి వద్ద ఉన్న కీలకమైన రవాణా శాఖను పువ్వాడ అజయ్ కుమార్‌కు కేటాయించారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వద్ద ఉన్న శాఖల్లోంచి కీలకమైన ఆహార, పౌర సరఫరాల శాఖను గంగుల కమలాకర్ కు అప్పగించారు. ఇప్పటి వరకూ కొప్పుల ఈశ్వర్ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను కూడా కమలాకర్‌కే కేటాయించారు. అలాగే, కొప్పుల ఈశ్వర్ నుంచి గిరిజన సంక్షేమ శాఖను తొలగించి సత్యవతి రాథోడ్‌కు అప్పగించారు. దీంతో, ఇప్పుడు కొప్పుల వద్ద ఎస్సీ, వికలాంగులు, మైనారిటీ సంక్షేమ శాఖలు మాత్రమే మిగిలాయి. అలాగే, ఇప్పటి వరకూ మల్లారెడ్డి వద్ద ఉన్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖను కూడా సత్యవతి రాథోడ్‌కు కేటాయించారు. దాంతో, మల్లారెడ్డి వద్ద కార్మిక, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి శాఖలు మిగిలాయి. మొత్తంగా ఓ మహిళా గవర్నర్ బాధ్యతలు చేపట్టిన రోజే ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో చోటు దక్కడం విశేషంగా చూడాలి.