‘ఎట్ హోం’లో అతిథుల సందడి!

akshaya రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీకి నమస్కరిస్తున్న బరాక్ ఒబామా

* ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఒబామా దంపతులు
* పచ్చిక మైదానంలో పసందైన విందు

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో సంప్రదాయంగా జరిగే విందు కార్యక్రమం ‘ఎట్ హోం’లోనూ విశిష్ట అతిథులైన ఒబామా దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇతర అతిథులను పలకరిస్తూ బిజీగా గడిపారు. అత్యంత సుందరంగా అలంకరించిన రాష్ట్రపతిభవన్ పచ్చిక బయళ్లలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ దంపతులు, ప్రధాని మోదీ, ఆయన కేబినెట్ సహచరులు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, త్రివిధ దళాధిపతులు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ సీనియర్ నేతలు, వివిధ దేశాల దౌత్యవేత్తలు సహా దాదాపు 14 వందలమంది అతిథులు హాజరయ్యారు.

ఒబామా పాల్గొంటున్న కారణంగా ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత్, అమెరికా భద్రతాధికారులు భద్రతాఏర్పాట్లను పర్యవేక్షించారు. రిబ్బన్ బారికేడ్లు ఏర్పాటు చేసి అతిధులను నియంత్రించారు. సాధారణంగా గంటకు పైగా జరిగే ఎట్ హోం కార్యక్రమాన్ని.. విందు అనంతరం మోదీ, ఒబామాలు ఇండో అమెరికన్ వ్యాపార ప్రముఖుల భేటీలో పాల్గొనాల్సి ఉన్నందున 40 నిమిషాలకు కుదించారు. ప్రాంగణంలో మోదీతో కలసి ఒబామా అతిథులను పలకరించారు. త్రివిధ దళాధిపతులతో పాటు 95 ఏళ్ల భారత వైమానిక దళ మార్షల్ అర్జన్ సింగ్‌తో ఒబామా కరచాలనం చేశారు. అర్జన్‌సింగ్‌తో కాసేపు మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ భార్య గురుచరణ్ సింగ్ రాష్ట్రపతి భవన్‌కు ముందే రాగా.. మన్మోహన్‌సింగ్ సోనియాగాంధీతో పాటు వచ్చారు. కూతురు ప్రతిభతో పాటు వచ్చిన బీజేపీ అగ్రనేత అద్వానీ చాలాసేపు ఒంటరిగానే ఉన్నారు.

కర్షణీయ వస్త్రధారణలో నేతలు..
కార్యక్రమంలో ఎరుపురంగు బోర్డర్ ఉన్న నలుపురంగు చీరలో సోనియాగాంధీ, చిన్నచిన్న పూల ప్రింట్లున్న హాఫ్‌వైట్ డ్రెస్‌లో ఒబామా సతీమణి మిషెల్, రెగ్యులర్ డార్క్ సూట్‌లో ఒబామా, క్రీమ్ కలర్ కుర్తా, ముదురు ఆరెంజ్ రంగు జాకెట్, భుజాలపై క్రీమ్ కలర్ శాలువాతో మోదీ.. ఆకర్షణీయంగా కనిపించారు. విందులో చికెన్ మలాయి టిక్కా, చీజ్ కుకుంబర్ శాండ్‌విచ్, ఆలూ మటర్ సమోసా, పనీర్ రాప్, అనార్ భోగ్ తదితర వంటకాలను అతిధులకు వడ్డించారు. విందు అనంతరం రాష్ట్రపతి ప్రణబ్, ఒబామా కాసేపు మాట్లాడుకున్నారు. ‘అనుభవజ్ఞుడైన మీలాంటి వ్యక్తి భారతదేశానికి రాష్ట్రపతి కావడం బావుంద’ని ఈ సందర్భంగా ఒబామా ప్రణబ్‌ను ప్రశంసించారు.

గమ్ మారో గమ్..
గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒబామా.. పరేడ్‌కు వచ్చింది మొదలు చివరిదాకా గమ్ నములుతూ కనిపించారు! మధ్యమధ్యలో మోదీతో మాట్లాడుతుండగా.. గమ్‌ను బయటకు తీశారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. ‘ఒబామా పద్ధతేం బాగోలేదు’ అంటూ విమర్శలు గుప్పించారు. భారత్‌కు ఉత్కృష్టమైన వేడుకల్లో గమ్ నమలడం ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

‘పరేడ్‌లో బరాక్ భాయ్ గమ్ నములుతూ తన దవడలకు పనిచెప్పారు. గుట్కాతో కాకుండా గమ్‌తో సరిపెట్టారు నయం! అయినా సంప్రదాయబద్ధంగా జరిగే ఈ వేడుకలో గమ్ నమలడం ఏంటి?’ అని ప్రముఖ రచయిత శోభా డే ట్వీటర్‌లో ప్రశ్నించారు. ‘అందరు అమెరికన్లలాగే ఆయనకు కూడా గమ్ అలవాటు ఉంది. ఆ గమ్ బ్రాండ్ ఏంటో?’ బాలీవుడ్ నిర్మాత శేఖర్ కపూర్ వ్యాఖ్యానించారు. ఒబామాకు గతంలో పొగతాగే అలవాటు ఉండేది. టొబాకోతో కూడిన గమ్ కూడా నమిలేవారు. ఇప్పుడు మాత్రం టొబాకో లేని గమ్‌లు వాడుతున్నారు.
akshayaసంప్రదాయాలు ఔట్!
ఈ గణతంత్ర వేడుకల్లో ఒబామా సంప్రదాయాలకు నీళ్లొదిలారు! కంటి మీద రెప్పవాల్చకుండా ఆయనను అనుక్షణం భద్రంగా చూసుకునే సీక్రెట్ సర్వీస్ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. బహిరంగ వేదికపై ఏకంగా రెండుగంటల పాటు కూర్చున్నారు. ఇది అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం రూల్స్‌కు పూర్తి విరుద్ధం. ఆయన ఎక్కడైనా 45 నిమిషాలకు మించి బహిరంగ వేదిక పై కూర్చోరాదన్నది నిబంధన. అయితే పరేడ్‌లో మోదీతో కలిసి 120 నిమిషాల పాటు గణతంత్ర వేడుకలను తిలకించారు. అలాగే రాష్ట్రపతి వాహనంలో కాకుండా ఒబామా తన సొంత వాహనం ‘బీస్ట్’లో వచ్చారు.