-ఎడతెరిపి లేని వర్షాలు-విలవిలలాడుతున్న ఏజెన్సీ.

-ఉమ్మడి జిల్లాలో 175 ఇండ్లకు పైగా నేలమట్టం.
-పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు.
పత్తి చేలల్లో నిలిచిన నీరు.
-భారీగా తగ్గనున్న దిగుబడులు.
-రెండు రెక్కలు తప్ప ఆస్తులు లేని కుటుంబాలు.
-ప్రభుత్వ పరిహారం అందేదెప్పుడు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు8(జనంసాక్షి):
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా చిగురుటాకుల ఉనికిని కోల్పోతుంది. ఇప్పటికే వంద ఇండ్లకు పైగా నేలమట్టమయ్యాయి. ఒక అచ్చంపేట మండల పరిధిలోనే 25 ఇండ్లకు పైగా  పాక్షికంగా దెబ్బతిన్నాయంటే పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పత్తి చేలల్లో నీళ్లు నిలిచాయి. వాగులు,వంకలు పొంగి పొర్లుతుడడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి.ఈ ఏడాది ఖరీఫ్ లో దిగుబడులు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తక్షణం పంట నష్టంతో పాటు కూలిపోయిన ఇండ్లను అంచనా వేసి పరిహారం అందించాలని పలు ప్రజాసంఘా ల నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో ని నార్లాపూర్ గ్రామంలో బోయ నిరంజన్ కు చెందిన ఇల్లు రాత్రి పొద్దుపోయిన తర్వాత కుప్పకూలింది. వాళ్లు బయట ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది.రెండు రెక్కలు తప్ప ఆస్తులు లేని వీళ్ళ కుటుంబం ఇల్లు కూలిపోవడంతో రోడ్డున పడింది.ఇల్లు కూలిన కుటుంబానికి మండల తాసిల్దార్ గాని, ప్రజాప్రతినిధులు గాని వచ్చి పరిహారం విషయంలోనూ ఆదుకుంటామని హామీ ఇచ్చిన సందర్భాలు లేవు.పక్షం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఐదు ఇండ్లకు పైగా నేలమట్టమయ్యాయి. బాధిత కుటుంబాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించిన విషయం తెలిసిందే. అచ్చంపేట మండల పరిధిలో 25 ఇల్లు పైగానే పాక్షికంగా కూలిపోయాయి.గద్వాల్ లో 25 వనపర్తిలో 30 నారాయణపేటలో 40 మహబూబ్ నగర్ 35 నాగర్ కర్నూల్ లో 45 ఇండ్లు నేలమట్టమయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం 175 ఇండ్లు పక్షం రోజులుగా కూలిపోయాయి.మరో రెండు రోజులు వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.దీంతో మట్టి ఇండ్లు పురాతన కట్టడాలలో నివసిస్తున్న వారు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లడిస్తున్నారు.
పంటలకు భారీ నష్టం:
కురుస్తున్న భారీ వర్షాల వల్ల పత్తి మొక్కజొన్న కంది పంటలకు భారీ నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి.నాగర్ కర్నూల్ నారాయణపేట మహబూబ్ నగర్ పరిధిలో నల్ల భూములు ఉన్నాయి. ఇక్కడ అధికంగా పత్తి పంటలను సాగు చేస్తారు. గద్వాల్ లో సైతం నల్ల భూములు ఉన్నాయి ఇక్కడ విత్తనాలను సాగు చేస్తారు. పత్తికి తోడుగా నారాయణపేట జిల్లాలో కంది పంటలను సాగు చేస్తారు. ఈ పంటలకు నీరు చిచ్చులేసి ఎదుగుదల ఆగిపోతుంది. పంట పొలాల్లో నీరు నిలవడం వల్ల పదును అధికమై చెట్లు ఎండిపోయే అవకాశాలు ఉన్నాయి.
పొంగిపొర్లుతున్న వాగులు వంకలు:
 
కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబ్నగర్ షాద్నగర్ నుండి వచ్చే దుందుభి నది ఉదృతంగా ప్రవహిస్తోంది.30 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం అక్కడక్కడ చెక్ డ్యాములు నిర్మించడంతో చెరువులను తలపిస్తు న్నాయి.కోయిల్ సాగర్ కృష్ణా నది బీమా తుంగభద్ర నదులు లక్షల క్యూసెక్కుల్లో ప్రవహిస్తున్నాయి. మత్స్యకారులు వేటను వెళ్లడం లేదు. ఎల్లో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎవరైనా నదుల్లోకి వేటగాని పర్యాటకులు గాని వెళ్లడానికి వీలులేదని ఆదేశాలు జారీ చేశారు.సహాయ చర్యలు శూన్యం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం స్పందించడం లేదు. పంటలు నీళ్లలో మునిగిన ఇండ్లు కూలిపోయిన అధికారులు వచ్చి బాధితులకు భరోసా కల్పించడం లేదు. 175 ఇండ్లు నీలమట్టమైన ఇప్పటికీ వారికి ప్రత్యామ్నాయ ఆవాసాలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా రైతులకు వర్షాలు అధికమైనప్పుడు సలహాలు సూచనలు ఇచ్చే విషయంలో వ్యవసాయ యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం వల్ల నష్టం భారీగా చేకూరి అవకాశాలు ఉన్నాయి.
ఏజెన్సీ విలవిల:
నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే ఏజెన్సీ వాసులు విలవిలలాడుతున్నారు.వేసవి కాలంలోనే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల వల్ల జీరో డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయి వనికిపోతున్నారు.అడవి గడ్డితో వేసుకున్న గుడిసెలు జలమయం అవుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి ఏజెన్సీ వాసులను పరిశీలించి వీరికి బట్టలు దుప్పట్లు, సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గుడిసెలు లేని వారికి టెంట్లను ఏదేసి అందులో నివసించేలా చర్యలు తీసుకోవాలి.ముఖ్యంగా వర్షాకాలంలో వీరికి అడవి ఆహార వస్తువులు లభించవు.తిండికి కష్టమవుతుంది.వర్షాకాలంలో వీరికి అనేక రోగాలు చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి వీరికి ఆహార వస్తువులను సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.
బాధితులను ఆదుకోవాలి:
పృథ్వీ రాజ్.బిఎస్పీ నియోజకవర్గం అధ్యక్షుడు.:
కురుస్తున్న భారీ వర్షాల వల్ల అనేకమంది నష్టాల పాలయ్యారు.ఇండ్లు కూలిపోయి నేలమట్టమైన వారు రోడ్డున పడ్డారు.వీరికి ప్రత్యామ్నాయ ఆవాసాలు ఏర్పాటు చేయాలి. పంట చేలల్లో నీరు నిలిచి ఎండిపోతున్నా రైతన్నలకు అధికారులు భరోసా ఇవ్వాలి. వాగులు వంకలను దాటడానికి వెళ్లి ప్రజలు ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సమయాల్లో రక్షణ చర్యలు తీసుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి.