‘ఎనిమిదేళ్ల వరకు ఢోకా లేదు’
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ మధ్యలోనే ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ బయట ఎక్కడా తను పెదవి విప్పలేదు. అయితే ఆ సమయంలో తోటి సహచరులతో డ్రెస్సింగ్ రూమ్‌లో పంచుకున్న భావాలను వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వెల్లడించాడు. ఇప్పుడున్న టెస్టు జట్టుపై ధోని పూర్తి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడని, రానున్న కాలంలో జట్టుకు వీరంతా కీలకంగా ఉంటారని అతడు అభిప్రాయపడినట్టు తెలిపాడు.
‘వచ్చే ఏడు నుంచి ఎనిమిదేళ్ల వరకు ఇప్పుడున్న జట్టు బలంగా ఉండనుంది. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మీరంతా అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాల్సి ఉంది’ అని ధోని తమతో డ్రెస్సింగ్ రూమ్‌లో చెప్పినట్టు సాహా తెలిపాడు.
జడేజా పరువు నష్టం దావా
జామ్‌నగర్: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా… రాజ్‌కోట్ నుంచి వెలువడే సాయంకాల దినపత్రిక ‘అబ్‌తక్’పై రూ.51 కోట్లకు పరువునష్టం దావా వేశాడు. దీంతో ఎడిటర్ సతీష్ మెహతాను వచ్చే నెల 4న కోర్టుకు హాజరు కావాలని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి పీబీ పర్మార్ ఆదేశించారు.
బలవంతపు వసూళ్లు, భూకబ్జా అభియోగాలు ఎదుర్కొంటున్న బాలి దంగార్‌తో జడేజా అతడి వ్యాపార భాగస్వామి జెనెసిహ్ అజ్మీరాలకు సంబంధాలున్నాయని గతేడాది నవంబర్ 20న ఈ పత్రికలో కథనం ప్రచురితమైంది. మరోవైపు దీనిపై తమ లీగల్ నోటీసులకు సమాధానమివ్వకపోవడంతో కోర్టుకెళ్లాల్సి వచ్చిందని జడేజా లాయర్ తెలిపారు.