ఎన్నడూ లేని అభివృద్దిని చేసి చూపారు

సింగరేణికి అండగా నిలిచిన సిఎం కెసిఆర్‌

మరోమారు గెలపించి అభివృద్దికి పట్టం కట్టాలి

ప్రచారంలో సోమారపు పిలుపు

రామగుండం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): గత60 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఐదేళ్లలో సాధించి చూపించారని రామగుండం తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 5 ఇంక్లైన్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ధూమ్‌ దాం కార్యక్రమానికి సోమారపు తో పాటు టీబీజీకేఎస్‌ అధ్యక్షులు వెంకట్రావ్‌ నగర మేయేర్‌ రాజమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ టిఆర్‌ఎస్‌ను ఆదరించాలన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ముఖ్యమంత్రి దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన 200 రూపాయల పెన్షన్‌ 1000 రూపాయలకు.. 500 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్‌ 1500లకు పెంచిన ఘనత కేసీఆర్‌ కు దక్కుతుందన్నారు. షాదీ ముబారక్‌, కళ్యాణ లక్ష్మీ కింద పేదింటి ఆడపడుచులకు లక్షా 16 వేల రూపాయలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ దే అని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం చేశారని రాబోయే ఎన్నికల్లో

కారు గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కుట్రల మహాకూటమికి చోటులేదని అన్నారు. ఎన్నికల సమయంలో మేము ఉన్నామంటూ గ్రామాలకు వచ్చే మహాకూటమి నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. కారు గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ మొదటి అసెంబ్లీ సమావేశంలోనే సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి లేఖ పంపినట్లు సోమారపు సత్యనారాయణ తెలిపారు. సీఎం కేసీఆర్‌ మొదటి నుంచి కార్మికుల పక్షపాతిగా నిలుస్తున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ ఇంక్రిమెంటు ఇచ్చి, ఆత్మగౌరవాన్ని పెంపొందించారని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్‌ ఎంతో కృషి చేసారని, కేసీఆర్‌ ముఖ్యమంత్రి గా ఉన్నన్ని రోజులు సింగరేణిలో కారుణ్య నియామకాలు కొనసాగుతాయని టీబీజీకేఎస్‌ అధ్యక్షులు వెంకట్రావు చెప్పారు.