ఎన్నికలకు సర్వంసిద్ధం
– 7న జరిగే ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం
– 4.93లక్షల బోగస్ ఓట్లను ఏరివేశాం
– ఇప్పటికే అభ్యర్ధుల క్రిమినల్ రికార్డులను సేకరించాం
– పార్టీల మేనిఫెస్టోలు, హావిూలను పరిశీలిస్తున్నాం
ఎప్పుడూ లేనంతగా భారీగా నగదు పట్టివేత
– రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్
హైదరాబాద్, డిసెంబర్3(జనంసాక్షి): ఈనెల7న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. సోమవారం సోమాజికగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘విూట్‌ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు.. ఎన్నికల నిర్వహణ అనేది ఒక సవాల్ అనిఅన్నారు. ఎన్నో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. నెలరోజుల్లో ఎన్నికల పక్రియ వేగవంతం చేశామని రజత్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 4.93 లక్షల బోగస్ ఓట్లు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 2 లక్షలకు పైగా డబుల్ పేర్లు ఉన్నవారిని తొలగించామని, 3లక్షలకుపైగా చనిపోయిన వారి ఓట్లు తొలగించామన్నారు. తొలిసారి ఎన్నికల్లో వీవీప్యాట్లను ఉపయోగిస్తున్నామన్నారు. ఎన్నికల పక్రియలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువస్తున్నామన్నారు. ఓటర్లను చైతన్యపరిచేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అలాగే భారీగా నగదును పట్టుకున్నామని అన్నారు. ఎన్నికల్లో బాగా ఖర్చు పెరిగిందని అంగీకరించారు. గతంలో ఎప్పుడూ ఇంతగా నగదు పట్టుబడ లేదన్నారు. అభ్యర్థుల నేరచరిత్ర సేకరించామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు, హావిూలను పరిశీలిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల బెట్టింగ్‌లు తమ పరిధిలోకి రావని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.