ఎన్నికలు ప్రశాంతం
` తెలంగాణలో ముగిసిన పోలింగ్
` చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్
` సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్
` పలుచోట్ల స్వల్ప ఘర్షలు.. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ మధ్య వాగ్వాదాలు
` 3న కౌంటింగ్ ప్రక్రియ…అదేరోజు ఫలితాల ప్రకటన
హైదరాబాద్,నవంబర్30(జనంసాక్షి):తెలంగాణలో పోలింగ్ పక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు.గ్రావిూణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ మందకొడిగా ఉందని సమాచారం అందింది. మొత్తం విూద తెలంగాణలో 65 నుంచి 68 శాతం మధ్యలోనే పోలింగ్ నమోదవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గనుంది. 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. 3న ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2018 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదైంది. కాగా రాత్రి 7 గంటల తర్వాత పోలింగ్ శాతాన్ని ఈసీ అధికారికంగా వెల్లడిరచనుంది. 119 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి పక్రియ ప్రారంభం కాగా, కొన్ని చోట్ల ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. కాగా, కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపుతో ఓటర్లు క్యూలో ఇబ్బంది పడ్డారు. అటు, హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఓటు వేయాలని ఎన్నికల సంఘం, పలువురు ప్రముఖులు ఎంత అవగాహన కల్పించినా మార్పు రాలేదు. సమస్యాత్మక కేంద్రాల్లో 13 నియోజకవర్గాల్లోనే పోలింగ్ ముగిసింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. 5 గంటల లోపు క్యూలైన్లలో నిల్చున్న వారికి మాత్రమే ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో సాధారణ ఓటర్లతో పాటు సెలబ్రిటీలూ ఓటేసేందుకు పోటెత్తారు. సాధారణ పౌరుల్లా క్యూలో నిల్చొని మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. 3,26,18,205 మంది ఓటర్లలో ఎంత శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారో తెలియాల్సి ఉంది. సాయంత్రం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఎన్నికల్లో పలుచోట్ల ఘర్ణణలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బీఆస్‌ఎస్` కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. మల్కాజిగిరి నియోజకవర్గం లోని మౌలాలి డివిజన్ ఆడమ్స్ స్కూల్ వద్ద టిఆర్‌ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు అనుచరులు తమ కార్యకర్తలపై దాడి చేశారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆడమ్స్ స్కూల్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం మైలారంలో టెన్షన్ మొదలైంది. రాయపర్తి మండలం మైలారం పోలింగ్ కేంద్రం దగ్గర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అనుకూలంగా`వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఇరువురిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. రెండు వర్గాలు పరస్పర దాడికి దిగాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారు గుగులోతు యాకన్న, చిర్ర శీనుగా పోలీసులు గుర్తించారు. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూర్‌లో ఓటర్లు ఆందోళనకు దిగారు. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామాలకు రప్పించి ఓట్లు వేస్తే డబ్బులు ఇస్తామని బీఆర్‌ఎస్ నాయకులు మోసం చేశారని ఓటర్లు గ్రామంలో ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటలైన ఓటర్ స్లిప్ లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తూస్తున్నారని ఓటర్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆకునూర్ రోడ్డుపై ఆందోళన చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులను చెదరగొట్టి ఓట్లు వేసేందుకు ఓటర్లను పోలీసులు పంపించారు. పాతబస్తీలోని హుస్సేనిహాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ చార్మినార్ నియోజకవర్గ అభ్యర్థి సోదరుడు సలీంపై ఎంఐఎం నాయకులు దాడి చేశారు. ఎన్నికల సందర్భంగా గురువారం మధ్యాహ్నం చోటా బజార్ ప్రాంతంలోని ఓషియన్ పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న పోలింగ్ బూత్‌ను సలీం పరిశీలించడానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎంఐఎం నాయకులు సలీంకు ఎదురుపడడంతో వాగ్వాదం నెలకొంది. చివరకు ఇది ఇరువర్గాల మధ్య గొడవకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఓకరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న పొలీసులు సలీంను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘర్షణ నేపథ్యంలో చార్మినార్ వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు. కామారెడ్డి పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలోని ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకోవడంతో టెన్షన్ నెలకొంది. బూత్ వైస్ పోలింగ్ స్టేషన్లను విజిట్ చేసిన రేవంత్‌ను బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల హోరా హోరీ నినాదాలతో బూత్ వద్ద హైటెన్షన్ నెలకొంది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త సద్దుమణిగింది.
నగరంలో ఓటేసిన సినీ ప్రముఖులు
తెలుగు చిత్రసీమకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న హైదరాబాద్ నగరంలో సినీ ప్రముఖులు ఉదయమే తరలివచ్చి ఓటేశారు. మెగాస్టార్ చిరంజీవి సహా అల్లు అర్జు, ఎన్టీఆర్ తదితరులు క్యూలో నిలబడి తమ ఓటును వినియోగించుకున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి, రాజమౌళి దంపతులు. దర్శకుడు తేజ తదితరులు ఓటేశారు. చిత్రసీమ ప్రముఖులు చాలా మంది నివసించే నగరం ఇది! వాళ్ళకు ఇక్కడ ఓటు హక్కు ఉంది. ఈ రోజు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళందరూ ఉదయాన్ని తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు ఉదయం ఎనిమిది గంటలకు జూబ్లీ హిల్స్ క్లబ్బులో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి ఆయన వచ్చారు. చిరు వెంట కుమార్తె శ్రీజ కూడా ఉన్నారు. చిరంజీవి తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఓటు హక్కు వినియోగించుకుంటారని సమాచారం ఇచ్చారు. ఓటు వేయడం కోసం మైసూరులో జరుగుతున్న ’గేమ్ ఛేంజర్’ చిత్రీకరణకు చిన్న విరామం ఇచ్చి మరీ ఆయన హైదరాబాద్ వచ్చారు. ఇదిలావుంటే మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని చాటేది ఓటని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్‌లోని 375వ పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కును వినియోగించు కున్నారు. ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదన్నారు. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఓటు హక్కు చాటుతుందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, విద్యావంతులు ఓటు వేయడాన్ని తమ బాధ్యతగా భావించి.. పోలింగ్‌లో పాల్గొనాలన్నారు.
నర్సాపూర్‌లో స్వల్ప ఉద్రిక్తత
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌడిపల్లి మండలంలోని లింగంపల్లి బిట్ల తండాలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి కుమారుడి వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు. ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసహనానికి లోనైన కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని బిఆర్‌ఎస్ ఆరోపించింది. దాడితో నర్సాపూర్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.బిట్లతండాలో బీఆర్‌ఎస్ అభ్యర్ధి సునీతా లక్ష్మారెడ్డి కుమారుడు వాకిటి శశిధర్ రెడ్డి కారుపై కాంగ్రెస్ కార్యక్తర్తలు దాడి చేశారు. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వెళుతున్న శశిధర్ రెడ్డి కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో శశిధర్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
చింతమడకలో ఓటేసిన కెసిఆర్ దంపతులు
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వచ్చిన కెసిఆర్ తన ఓటు వేశారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రానికి రాని చింతమడక ఓటర్లు..కేసీఆర్ రాగానే భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఓటు వేసిన అనంతరం బయటకు వచ్చిన సీఎం ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం కేసీఆర్ దంపతులు హైదరాబాద్ కు బయలదేరారు. కేసీఆర్ దంపతుల వెంట మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. చింతమడక గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు. సీఎంకు చింతమడక గ్రామం ఒక సెంటిమెంట్‌గా ఉంటోంది. సీఎం దంపతులు చింతమడకకు రావటంతో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఓట్ల లిస్టులో కేసీఆర్ సీరియల్ నెంబర్ 158గా ఉంది. అలాగే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ నందినగర్ ప్రాంతంలో ఓ పోలింగ్ బూత్‌లో తన భార్య శైలిమతో కలిసి ఓటు వేశారు. పోలింగ్ బూత్ బయట విూడియాతో మాట్లాడారు. తెలంగాణ పౌరుడిగా తన ఓటు హక్కు వినియోగించు కున్నానని అన్నారు. దీంతో తన బాధ్యత తాను నెరవేర్చుకున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేవాళ్లకే తాను ఓటు వేసినట్లుగా కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి కోసం పాటు పడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి ఓటు వేశానని చెప్పారు. తెలంగాణలో ఓటు ఉన్న వారు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చారు. పట్టణ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు. బంజారాహిల్స్‌లోని నందినగర్ ప్రాంతంలో డీఏవీ స్కూల్ పోలింగ్ స్టేషన్‌లో కవిత ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత కవిత విూడియాతో మాట్లాడారు. ప్రజలు అందరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని అందరూ ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించేలా కవిత వ్యాఖ్యలు చేశారు. తమకు ఓటు వేయాలనే వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే. కవిత వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం కవితపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేటలో ఓటు వేశారు. భార్య శ్రీనిత, తనయుడు అర్చిస్ మాన్‌తో కలిసి వచ్చిన మంత్రి ఓటు వేసి.. ప్రజలంతా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఓటు వేసిన అనంతరం పోలింగ్ బూత్ బయట ప్రచారం చేయడంతో కవితపై ఫిర్యాదు అందినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. దీనిపై డీఈవోకు ఆదేశాలిచ్చామని ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయిందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల సరళిపై విూడియాతో మాట్లాడిన వికాస్ రాజ్ ..రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందిని తెలిపారు. ఈవీఎం సమస్యలు వచ్చిన దగ్గర కొత్తవి మార్చామని వెల్లడిరచారు. రూరల్ లో పోలింగ్ శాతం బాగానే ఉందన్న ఆయన.. అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయని,జరిగిన ప్రతి కంప్లైంట్స్ పై డీఈవోలను రిపోర్ట్ అడిగామన్నారు వికాస్ రాజ్. ఉదయం 11గంటల వరకు 20.64శాతం నమోదు అయిందని తెలిపారు.