ట్రంప్, పుతిన్ భేటీ 15న..
` అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య కీలక సమావేశం
` ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చించే అవకాశం
` భేటీని స్వాగతించిన భారత విదేశాంగ శాఖ
` భారత్‌కు సుంకాల ఊరట లభించే అవకాశం
న్యూఢల్లీి,ఆగస్ట్9(జనంసాక్షి):ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఆగస్ట్ 15న అలస్కాలో ఈ భేటీ జరగనున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. గత కొంతకాలంగా ఉద్రిక్తంగా ఉన్న ఉక్రెయిన్ యుద్ధానికి ఈ సమావేశం ఒక ముగింపు పలుకుతుందని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి. గత మూడు రోజులుగా చోటుచేసుకున్న వేగవంతమైన పరిణామాల అనంతరం ఈ భేటీ ఖరారైంది. ‘‘ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమావేశం ఆగస్ట్ 15, శుక్రవారం నాడు అలస్కాలో జరుగుతుంది’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో వెల్లడిరచారు. ఈ సమావేశం భారత్‌కు కూడా ఎంతో కీలకం కానుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు వాషింగ్టన్, భారత్‌పై విధించిన 25 శాతం అదనపు సుంకాల భవిష్యత్తు ఈ భేటీతో తేలే అవకాశం ఉంది. ఈ పరిణామాన్ని భారత్ మనస్ఫూర్తిగా స్వాగతించింది. అమెరికా, రష్యా మధ్య కుదిరిన ఈ అవగాహనను అభినందిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ సమావేశం ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, శాంతికి అవకాశాలు కల్పిస్తుందని ఆశిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ అనేకసార్లు చెప్పినట్లుగా ‘ఇది యుద్ధాల యుగం కాదు’’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. శిఖరాగ్ర సమావేశానికి ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్ అంశంపై అమెరికాతో జరిగిన చర్చల వివరాలను ఆయన మోదీకి వివరించారు. భారత్-రష్యా మధ్య ఉన్న ప్రత్యేక భాగస్వామ్యం దృష్ట్యా, అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక దూత స్టీవెన్ విట్కాఫ్‌తో జరిగిన సమావేశంలోని కీలక అంశాలను పుతిన్ పంచుకున్నారని రష్యా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. పుతిన్ అందించిన వివరాలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ, వివాదానికి శాంతియుత పరిష్కారం కనుగొనాలన్నదే భారత్ స్థిరమైన వైఖరి అని పునరుద్ఘాటించారు. ఈ సమావేశానికి ట్రంప్ ప్రత్యేక దూత స్టీవెన్ విట్కాఫ్, పుతిన్‌తో మాస్కోలో జరిపిన చర్చలే పునాది వేశాయి. ఈ చర్చల అనంతరం ట్రంప్ మాట్లాడుతూ, పుతిన్‌తో సానుకూల చర్చలు జరిగాయని, శాంతి నెలకొనేందుకు మంచి అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఇరు దేశాల ప్రయోజనాల కోసం కొన్ని భూభాగాల మార్పిడి కూడా ఉండొచ్చు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.