ఆధారాలతోనే రాహుల్‌ ఆరోపణలు

` ఈ విషయమై ఈసీ మాట్లాడాలి
` ఓట్ల దొంగతనం, ఫేక్‌ ఓటర్ల లిస్ట్‌ గురించి సమగ్రంగా పరిశీలించాలి
` శరద్‌ పవార్‌ , అఖిలేష్‌
ఢల్లీి(జనంసాక్షి):మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ తాజాగా రాహుల్‌ గాంధీకి మద్దతుగా నిలిచారు. రాహుల్‌ గాంధీ ఇటీవల ఓ ప్రెజెంటేషన్‌ ద్వారా ఓట్ల దొంగతనం, ఫేక్‌ ఓటర్ల లిస్ట్‌ గురించి ప్రస్తావించారు. దీనిపై శరద్‌ పవార్‌ తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయాన్ని భారత ఎన్నికల కమిషన్‌ సమగ్రంగా పరిశీలించాలని, ఇది చిన్న విషయం కాదన్నారు. వాటిలో కర్ణాటక, మహారాష్ట్రలలో ఎన్నికలు లేకపోయినా, దేశవ్యాప్తంగా పద్ధతిగా జరిగే ఎన్నికల మీద ఇలాంటి అంశాలు ప్రభావం చూపుతాయని ఆయన హెచ్చరించారు. రాహుల్‌ గాంధీ ఈ విషయాలను ప్రస్తావించే ముందు స్పష్టమైన అధ్యయనం చేశారని పవార్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇండియాపై తిరిగి 25% నుంచి 50% వరకు దిగుమతి సుంకాలు పెంచే ప్రతిపాదన చేయడం పట్ల శరద్‌ పవార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారత్‌పై ఒత్తిడి తేవాలనే ప్రయత్నం అని ఆయన పేర్కొన్నారు. విదేశాంగ విధానాల్లో మన దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఆయన స్వరం పెంచారు. పాకిస్తాన్‌ శత్రువులా మారింది, నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకతో సంబంధాలు అంత మంచిగా లేవన్నారు. మనం ఈ సంబంధాలను మెరుగుపరచుకోవాలన్నారు. ప్రధాని మోదీ ఈ విషయాలను పట్టించుకోవాలని పవార్‌ హితవు పలికారు. అజిత్‌ పవార్‌తో శరద్‌ పవార్‌ కలిసి కనిపించడం, ప్రత్యేకించి కుటుంబ వేడుకల్లో కలసి కనిపించడం రాజకీయంగా కొత్త చర్చకు తావిచ్చింది. ఇటీవల ముంబైలో జరిగిన యుగేంద్ర పవార్‌ నిశ్చితార్థ వేడుకలో శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. దీంతో శివసేన బీజేపీ కూటమికి శరద్‌ పవార్‌ మద్దతు ఇవ్వబోతున్నారా? అనే చర్చ మొదలైంది. కానీ శరద్‌ పవార్‌ తన పాత ధోరణి గురించి స్పష్టం చేశారు. బీజేపీకి ఎప్పటికీ మద్దతు ఇవ్వనని, రాజకీయాల్లో తన సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటానని మరోసారి గుర్తు చేశారు.