పదవీకాలం ముగిసింది.. జోక్యం చేసుకోలేం
` రమేశ్ పౌరసత్వ వివాదంలో కీలక పరిణామం
` హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు
` ఆది శ్రీనివాస్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం
హైదరాబాద్,ఆగస్టు9(జనంసాక్షి):వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి పదిహేనేళ్లుగా కొనసాగుతున్న పౌరసత్వ వివాదానికి సుప్రీంకోర్టు శుక్రవారం ముగింపు పలికింది. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. రమేశ్ పోటీ చేసిన ఎన్నికల పదవీకాలం ఇప్పటికే ముగిసిపోయినందున, ఆ విషయాన్ని ఇప్పుడు పునరుద్ధరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఆది శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ, రమేశ్ దేశాన్ని మోసం చేసినట్లు హైకోర్టు గుర్తించినప్పటికీ ఆయన ఇప్పటికీ పింఛనుతో సహా ఇతర శాసనసభ ప్రయోజనాలను పొందుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, సుప్రీంకోర్టు ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు.చెన్నమనేని రమేశ్ జర్మన్ పౌరసత్వం కలిగి ఉండి, ఆ విషయాన్ని దాచిపెట్టి ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపిస్తూ ఆది శ్రీనివాస్ 2019లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, నిబంధనలు పాటించలేదన్న కారణంతో 2019 నవంబరులో రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ రమేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, 2024 నవంబర్ 6న కీలక తీర్పు వెలువరించింది. రమేశ్ జర్మన్ పౌరుడేనని నిర్ధారిస్తూ, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రజా పదవులు చేపట్టడానికి అనర్హుడిగా ప్రకటించింది. 15 ఏళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఆయనకు రూ. 30 లక్షల జరిమానా కూడా విధించింది. ఇందులో రూ. 25 లక్షలు ఆది శ్రీనివాస్‌కు, రూ. 5 లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించగా, రమేశ్ ఆ మొత్తాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో చెల్లించారు.2009 నుంచి 2018 వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ రమేశ్ గెలుపొందగా, ఆది శ్రీనివాస్ రెండో స్థానంలో నిలిచారు. రమేశ్‌ను అనర్హుడిగా ప్రకటించినందున, ఆ పదవీకాలాలకు తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని శ్రీనివాస్ కోరారు. అయితే హైకోర్టు దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆయన అభ్యర్థనను తిరస్కరించడంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది. కాగా, 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ రమేశ్‌కు టికెట్ నిరాకరించగా, వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆది శ్రీనివాస్ విజయం సాధించారు.