ఎన్నికల్లో బురదజల్లుకోవడం

ఫలితాలు వచ్చాక అధికారం కోసం కౌగలించుకోవడం
కర్నాటక్‌ తరహా రాజకీయాలు మారాల్సిందే
బెంగళూరు,మే19(జ‌నం సాక్షి): ఇటీవలి కర్నాటక ఎన్నికల ప్రచార సమయంలో క్షేత్ర స్థాయిలో నెలకొన్న వాస్తవ సమస్యల ప్రస్తావనకన్నా, ప్రజలను ప్రలోభాల్లో ముంచడానికే కాంగ్రెస్‌, బిజెపి, జెడిఎస్‌లు కర్నాటకలో ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ మూడు పార్టీలు పరస్పరం విమర్శించుకుని పోటీ పడి ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాయి. ఎన్నికల్లో కనీసంగా అయినా తాము అవసరమైతే ఒకరినొకరు కలుస్తామని చెప్పలేదు. తీరా ఫలితాలు వెలువడ్డాక 38 సీట్లున్న జెడిఎస్‌ను గద్దెపై కూర్చోబెడతామని కాంగ్రెస్‌ ఎందుకు అనుకోవాలి. కేవలం 38 సీట్లతో ఎలా పాలన చేస్తారో ప్రధానిగా పని చేసిన పెద్దాయన దేవేగౌడకు తెలియదా? ఆయననకు కాంగ్రెస్‌ ఎలా కింద పడేసిందో అనుభవం లేదా? అయినా కాంగ్రెస్‌ అయాచితంగా మద్దతు ఇస్తామంటే ఎందుకు ఎగిరి గంతేసారు. ఐదేళ్ల పాటు ఖచ్చింతంగా తమతో పాటే ఉంటామని కాంగ్రెస్‌ ఏమైనా జెడెస్‌కు హావిూ ఇచ్చిందా అంటే అదీ లేదు. అధికారం కోసం అడ్డమైన గడ్డి తినడానికి సిద్దమని కార్నాటక రాజకీయాల ద్వారా ఆయా పార్టీలు రుజువు చేశాయి. రైతాంగ సంక్షోభం, సాగు
తాగునీటి సమస్య, నిరుద్యోగం, ఉద్యోగ భద్రత, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, విద్య, వైద్యం సామాన్యులకు అందకపోవడం వంటి అంశాల నుండి పక్కదోవ పట్టించడానికి టక్కుటమార విద్యలన్నీ ప్రయోగించాయి. అసలు సమస్యలకు పరిష్కారం చూపకపోగా, కొసరు పథకాలతో మభ్య పెట్టాయి. ప్రజల ఐక్యతను చీల్చడానికి బిజెపి మతాన్ని ఆయుధంగా వాడుతుంటే, తాను కూడా ఆ తానులో ముక్కేనని చెప్పడానికే కాంగ్రెస్‌ పోటీ పడింది. ఎన్నికల ముందు లింగాయత్‌లకు మతం ¬దా కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం నుండి ప్రచార పర్వంలో దేవాలయాలు, ఆశ్రమాల సందర్శనలో అమిత్‌షాతో రాహుల్‌గాంధీ పోటీ పడటం ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. కాంగ్రెస్‌ అనుసరించిన ఈ విధానం ఆ పార్టీకి ఉపయోగపడకపోగా, కోస్తా కర్ణాటకలో బిజెపి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడానికి దోహదపడింది. అవినీతి, నేర చరిత్ర ఉన్న వారికి టిక్కెట్లు ఇవ్వడం నుండి, ప్రచార పర్వంలో కోట్లు కుమ్మరించడం వరకు మూడు పార్టీలూ పోటీపడ్డాయి. పార్టీల పోకడలు, విధానాలతో పాటు నేతల మాటలు, చేతల్లో ఏ మాత్రమూ తేడా లేని పార్టీల్లో ఏదో ఒక దానిని ఎంచుకోక తప్పని స్థితి ఓటర్లకు ఏర్పడింది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ పార్టీకి తాజాగా ఓట్ల శాతం పెరిగినా సీట్లు తగ్గాయి. బిజెపికి కూడా గతంతో పోలిస్తే ఓట్ల శాతం పెరిగినప్పటికీ తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ కన్నా వెనుకబాటే! అయినా అత్యధిక స్థానాలు పొందిన పార్టీగా ఆవిర్భవించింది. ఈ రెండు పార్టీలతో పోలిస్తే ఓట్ల శాతంలోనూ, సీట్ల పొందడంలోనూ వెనుకబాట పట్టిన జెడిఎస్‌ నేత కుమారస్వామి చక్రం తిప్పిన తీరు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరు ప్రతిపాదనకు వచ్చిన వైనం పేరు రాజకయీ దిగజారుడు తనానికి దృష్టాంతంగా నిలిచిపోగలదు. మన ఎన్నికల వ్యవస్థలోని డొల్లతనాన్ని ఇది బట్టబయలు చేస్తోంది. ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పుల కోసం తీవ్రంగా మేధోమథనం చేయాల్సిన అవసరాన్ని  కర్నాటక ఫలితాలు గుర్తు చేస్తున్నాయి. కేవలం ఎన్నికల ఎత్తుగడలకు, పార్లమెంటరీ పోరాటానికి మాత్రమే పరిమితమయితే  ధన రాజకీయాన్ని నిలువరించడం సాధ్యం కాదు. ప్రజల కష్టాలకు, కన్నీళ్లకు కారణాలు చెప్పి, వాటిని సమూలంగా పరిష్కరించే నిజమైన ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తీసుకురావడం, వాటి ఆధారంగా జరిగే ప్రజా పోరాటాలను బలపరచడం అన్న విధానం రావాలి. కర్ణాటక ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వని పర్యవసానంగా భవిష్యత్‌లో అనుసరించాల్సిన చర్యలపై చర్చ సాగాలి.  ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ ఎవరిని పిలవాలన్న అంశంలో స్పష్టత ఉండాలి. గవర్నర్ల వ్యవస్థ తటస్థంగా ఉండి ఉంటే అసలు ఈ వివాదమంతా వచ్చేదే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు గవర్నర్లను నియమించడం, కీలక సమయాల్లో ఆ గవర్నర్లు కేంద్ర పాలకుల అభీష్టాన్ని నెరవేర్చడం ఒక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. నిరుడు గోవా, మణిపూర్‌, మేఘా లయల్లో అక్కడి గవర్నర్లు ఎన్నికల అనంతర కూటములను గుర్తించి అధికారం కట్టబెట్టకుండా అతి పెద్ద పార్టీనే పిలిచి ఉన్నా తాజా వివాదం ఏర్పడేది కాదు. ఆ రాష్టాల్లో గవర్నర్లు అనుసరించిన విధానం కర్ణాటకలో ఎందుకు మాయమైందన్న జేడీ(ఎస్‌),కాంగ్రెస్‌ల ప్రశ్న  ఉదయించేది కాదు.  అయితే గోవా వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గమనించదగ్గది. అతిపెద్ద పార్టీగా అవ తరించిన తమకు ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశవిూయకుండా గోవా గవర్నర్‌ అన్యాయం చేశారంటూ కాంగ్రెస్‌ పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు గవర్నర్‌కు విచక్షణాయుత అధికారాలుంటాయని ధర్మాసనం తేల్చి చెప్పింది. సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పేంత స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి లేనప్పుడు అతి పెద్ద పార్టీని కాదని కొత్తగా ఏర్పడిన కూటమికి అవకాశవిూయడంలో తప్పులేదని స్పష్టం చేసింది. కర్ణాటకలోనూ ఇదే సూత్రం వర్తింపజేయాలని ఇప్పుడు కాంగ్రెస్‌ వాదిస్తోంది. అయితే ఈ పరిణామాలపై నిర్ద్వంద్వంగా, నిజాయితీగా
స్పందించగల నైతిక స్థైర్యం ఉన్న పార్టీల, నేతల సంఖ్య అరుదుగా మారడం ఆందోళన కలిగించే అంశం.