ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన
మాజీ ఎమ్మెల్యే గంగులకు ఇసి నోటీసులు
కరీంనగర్,అక్టోబర్1(జనంసాక్షి): శాసనసభ రద్దయిన నాటి నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనానియామావళి అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌అహ్మద్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ కరీంనగర్‌లోని 44వడివిజన్‌లో సాయిబాబా దేవాలయం వద్ద సీసీరోడ్ల భూమిపూజ కార్యక్రమంలో మాజీశాసనసభ్యులు గంగుల కమలాకర్ పాల్గొన్నారు. దీనిపై ఆయనకు నోటీసులు జారీచేశారు. ఈకార్యక్రమానికి సంబంధించి వాట్సాప్ ఫొటోలతో జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు అందండంతో నగరపాలక సంస్థ ఎస్‌ఈ భద్రయ్య విచారణ చేసి నివేదిక సమ ర్పించారని చెప్పారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా మాజీ శాసనసభ్యుడు గంగులకమలాకర్‌తోపాటు డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేశ్, 44వ డివిజన్ కార్పొరేటర్ అజిత్‌రావు, 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ సదానందచారి, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కె సూర్య, భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనుట ప్రవర్తనానియామవళిని ఉల్లంఘనగా ఎందుకు భావించరాదో సంజాయిషి ఇవ్వాలంటూ వారం దరికి షోకాజ్ నోటీసులను జిల్లాఎన్నికల అధికారిజారీ చేశారు. షోకాజ్‌నోటీసు ముట్టిన 48 గంటల్లో సంజాయిషి సమర్పించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌అహ్మద్ తెలిపారు.
ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో అక్టోబర్ 3న జెట్ స్పీడ్ బోట్ల ప్రారంభోత్సవం. దీనికి సంబంధించి సెప్టెంబరు30 ఆదివారం వివిధ దినపత్రికలలో మాజీ శాసనసభ్యులు గంగుల కమలాకర్ స్పీడ్ బోట్ల పనితీరును పరిశీలించినట్లు వచ్చిన ఫొటోలు, వార్తలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందా..? రాదా అనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను సమర్పించాలని జిల్లా పర్యాటకశాఖ అధికారిని జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ ఆదేశించారు. అలాగే అక్టోబర్ 3న ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో జెట్ స్పీడ్ బోట్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తీరుపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.