ఎన్నికల పనుల్లో జిల్లా అధికార యంత్రాంగం బిజీ
ఓటింగ్ యాంత్రాల పరిశీలన పూర్తి
కరీంనగర్,అక్టోబర్1(జనంసాక్షి): ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా.. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం అవుతోంది. ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాలు, ఎలక్టాన్రిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్‌తోపాటు అధికార యంత్రాంగం బిజీబిజీగా ఉంది. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఇదేపనిలో తలమునకలవుతున్నారు. ఒకపక్క ఓటరు నమోదు పక్రియ, జాబితా ప్రకటన పక్రియ వేగవంతంగా చేస్తూనే.. మిగతా పనులన్నీ చక్కబెడుతున్నారు. జిల్లాకు వచ్చిన ఓటింగ్ మిషన్ల పరిశీలన, మాక్ పోలింగ్, రాజకీయ పార్టీలతో అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ జీవీ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో బెంగళూర్ నుంచి వచ్చిన 20 మంది ఇంజినీర్లు వీటి పనితీరును వివరించారు. కొత్తగా 1,540 వరకు వీవీ ప్యాట్స్ ప్రవేశపెట్టారు. జేసీ శ్యాంప్రసాద్‌లాల్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల ప్రాథమిక పరిశీలన కార్యక్రమం వారంరోజులుగా సాగుతోంది. వివిధ రాజకీ య పార్టీల సమక్షంలో బీఎల్ కంపెనీకి చెందిన 20 మంది ఇంజినీర్లు ఏ విధంగా పనిచేస్తాయో వివరించారు. కీప్యాడ్‌లు, డిస్‌ప్లే బోర్డులు, లైటింగ్, సౌండ్ సిస్టం పనితీరును పరిశీలిస్తున్నారు. ఈవీఎంలను అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం పంపించిన అన్ని ఈవీ ఎంలను ముందుగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటిస్థాయి తనిఖీని చేస్తున్నట్లు తెలిపారు. తర్వాత ఈవీఎంలు అన్నిసరిగా పని చేస్తున్నది లేనిది రాజకీయ నాయకుల సమక్షంలోనే ఇంజినీర్లు తనిఖీ చేస్తారన్నారు. అనంతరం కొత్తగా ఈవీఎంలకు వీవీ ప్యాట్స్‌ల పనితీరును కూడా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో వివరిస్తామని తెలిపారు.