ఎన్నికల వేళ.. భాజపాకు కోలుకోలేని దెబ్బ


` రాజగోపాల్‌రెడ్డి యూ టర్న్‌
` బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిక
` రాజకీయ విభేదాలు  సర్వసాధారణమే
` రేవంత్‌తో వ్యక్తిగత విభేదాలు లేవు
` పార్టీ ఆదేశిస్తే గజ్వేల్‌లోనూ పోటీకి సిద్దమే
` ఏనాడు స్వార్థ రాజకీయాల కోసం ఆరాటపడలేదు
` ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నా
` కాంగ్రెస్‌ చేరిన తరువాత ఆదరించాలని కోరుతున్నా
` మీడియా సమావేశంలో రాజగోపాల్‌ రెడ్డి
రంగారెడ్డి(జనంసాక్షి):పిసిసి చీఫ్‌ రేవంత్‌తో రాజకీయ విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు లేవని  మాజీ ఎమ్మెల్యే, బిజెపికి రాజీనామా చేసిన రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీలోకి వస్తానంటే ఒక మెట్టు దిగుతా అని రేవంత్‌ రెడ్డి చాలా సార్లు అన్నారు. నా జీవితంలో ఇది అతిపెద్ద నిర్ణయం. రేవంత్‌ నాకేమైనా శత్రువా?. కొన్ని సందర్భాల్లో బేధాభిప్రాయాలు ఉంటాయి. పీసీసీ పదవి శాశ్వతం కాదు. మునుగోడులో గెలిచామని బీఆర్‌ఎస్‌ వాళ్ళు చెప్పుకొగలుగుతున్నారా?. కేసీఆర్‌ని తప్పుకుండా జైలుకు పంపుతాం’ అని రాజాగోపాల్‌ చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కమలం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ కండువా కప్పుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాజీనామా అనంతరం మొదటిసారి మొయినాబాద్‌లోని తన ఫామ్‌ హౌస్‌ వేదికగా విూడియా విూట్‌ నిర్వహించి.. అసలు తాను రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది..? ఎందుకు కాంగ్రెస్‌లోకి మళ్లీ ఎందుకు చేరాల్సి వచ్చిందనే విషయాలను వివరించారు. ఇదే విూడియా ముఖంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి గురించి కూడా మాట్లాడారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్‌లో కేసీఆర్‌ పై పోటీ చేస్తాను. కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడులో పోటీచేసి గెలవాలని సవాల్‌ విసురుతున్నాను. అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని అన్నారు. అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో 27వ తేదీన కాంగ్రెస్‌లో చేరుతున్నాను. మునుగోడు, ఎల్బీ నగర్‌ టికెట్‌ ఇస్తానని బీజేపీ చెప్పింది. బీజేపీకి నేను పనికిరాను అని అధిష్ఠానానికి చెప్పాను. నాకు టికెట్‌ వద్దని అధిష్ఠానానికి క్లియర్‌కట్‌గా చెప్పాను. కమ్యూనిస్టులను మోసం చేసింది కేసీఆర్‌. టికెట్‌ కోసం కాంగ్రెస్‌లోకి రావడం లేదు. రాష్ట్రంలో నియంత పాలన పోవాలంటే కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలి. నేను ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మేల్యే అయ్యాను.. ఇంకేం పదవులు కావాలి నాకు..?. బీజేపీ` బీఆర్‌ఎస్‌ ఒకటే. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా అంటే ఇప్పటికీ గౌరవం ఉంది. కాంగ్రెస్‌ మహాసముద్రం. బీజేపీలోనే ఉండాలని నిన్నటి వరకు అనుకున్నాను. సర్వేలు, ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నాయి. ప్రజల మనిషిని కాబట్టి ప్రజలు చెప్పినట్టే వింటాను’ అని రాజగోపాల్‌ రెడ్డి చెప్పుకొచ్చారు.  మునుగోడులో ఓడిపోయినప్పుడు బాధపడలేదు. ఏ తప్పు చేయకుండా, మచ్చ లేకుండా నిజాయితీగా పనిచేశాను. నేను అమ్ముడు పోయానని కొందరు అన్నప్పుడు బాధపడ్డాను. దిగజారి నాపై విమర్శలు చేసినందుకు మనసులో ఏడ్చాను. నాపై విమర్శలు చేసిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు..?. నాపై ఆరోపణలు చేసిన వారు గుండెపై చేయి వేసుకొని సమాధానం చెప్పాలి. నన్ను కొనగలిగే శక్తి పుట్టలేదు.. పుట్టబోదు. నేను ఎక్కడ రాజీ పడలేదు. నా జీవిత ఆశయం కేసీఆర్‌ను గద్దె దించడమే. చేతిలో చిల్లిగవ్వ లేని కేసీఆర్‌ ఇప్పుడు లక్షల కోట్లు దోచుకున్నాడు. కేసీఆర్‌ మొహంలో రక్తం లేదు. ఓడిపోతామనే భయం కేసీఆర్‌లో కనిపిస్తోంది. ఉద్యమంలో పని చేసిన వాళ్ళని కలిసి తప్పు చేశామని కాళ్ళు పట్టుకుంటున్నారు. బావ బామ్మర్థులు కలిసి చిన్న చిన్న నాయకులను కూడా కొనే ప్రయత్నం చేస్తున్నారు’ అని కేసీఆర్‌పై రాజగోపాల్‌ విమర్శల వర్షం కురిపించారు.
ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నా
కెసిఆర్‌ కుటుంబ  దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం  మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నానని మునుగోడు మాజీశాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో  ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతుందని పేర్కొన్నారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బిజెపి, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడిరదన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను భావిస్తున్నానని తెలిపారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నానన్నారు. .తెలంగాణలో అవినీతి అరాచక నియంతృత్వ కుటుంబ పాలనకు చరమగీతం పాడే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉందని భావించి 15 నెలల క్రితం నేను మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం అందరికి తెలిసిందేనని గుర్తు చేశారు. గత ఏడాది అక్టోబర్‌ నెలాఖరున మునుగోడు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అవిూషా, బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డా  ఆశీస్సులతో  బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్‌ఎస్‌ను ఓడిరచినంత పని చేశానన్నారు. ఒక రాజకీయ యుద్ధం మాదిరిగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ 100 మంది ఎమ్మెల్యేలు మరో వంద మంది ఇతర సీనియర్‌  నేతలను ప్రచారంలోకి దింపి వందల కోట్లు ఖర్చు చేసి, భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ స్వల్ప తేడాతో నెగ్గి, నైతికంగా ఓడిరదన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో నా విజయం కోసం ప్రయత్నించిన బిజెపి నేతలు కార్యకర్తలు శ్రేయోభిలాషులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అవినీతిలో మునిగిన కేసీఆర్‌ సర్కారుపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న తెలంగాణ ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సవిూకరణాలు మారుతూ వచ్చాయని తెలిపారు. అధికార బి.ఆర్‌.ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదగలేక పోవడంతో ఆ స్థానంలోకి కాంగ్రెస్‌ వచ్చిందన్నారు. సకల జనుల పోరాటంతో సాకారమైన ప్రత్యేక తెలంగాణ పదేళ్ల  కెసిఆర్‌ సర్కారు అరాచక పాలనతో గాడి తప్పిందని ఆరోపించారు. అధికార మార్పును కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నేను కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బిజెపికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా నాకు నియంతృత్వ కేసీఆర్‌ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బిజెపికి ధన్యవాదాలు తెలిపారు. కెసిఆర్‌ సర్కారుపై యుద్ధం చేయాలని ప్రోత్సహించిన కేంద్ర మంత్రి అమిత్‌ షాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని నేను తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు. నాడు కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరినా, నేడు బిజెపి నుంచి కాంగ్రెస్‌లోకి మారుతున్నా లక్ష్యం మాత్రం ఒకటేనని కేసిఆర్‌ కుటుంబ అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే లక్ష్యమన్నారు. నేను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదని, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తపన పడ్డానని పేర్కొన్నారు. నియంత కెసిఆర్‌ పాలనను  అంతమొందించేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్న నన్ను  ఆదరించాలని రాష్ట్ర ప్రజలని కోరుతున్నానని తెలిపారు.