ఎన్నికల సంస్కరణలపై చర్చించాలి !

రెండేళ్లకు ముందే దేశంలోనూ, రాష్టాల్ల్రోనూ ఎన్నికల వేడి అందుకుంటోంది. మోడీని గద్దెదించడమెలా అన్న చర్చలే కానవస్తున్నాయి. తమ హయాంలో ఏవిూ చేశామో చెప్పుకోలని దౌర్భాగ్యంలో ఉన్న విపక్షాలు మోడీ నుంచి దేశాన్ని రక్షించాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ కేంద్రంగా మళ్లీ అంతా ఏకమయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. దేశంలో ప్రజల సమస్యలకన్నా పార్టీలకు ఎన్నికలే ముఖ్యంగా మారాయి. ఎప్పుడెప్పుడు గద్దెనెక్కుదామా అన్న ధోరణిలో ఉన్నాయి. భారత ప్రజాస్వామ్యంలో డొల్లతనం కారణంగా ఎన్నికల నిర్వహణకు వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇదే సందర్భంలో ఎన్నికల సంస్కరణ లకు శ్రీకారం చుట్టాలి. ఇటీవల క్రిమనల్‌ చరిత్రపై సుప్రీం ఇచ్చిన ఆదేవాలకు అనుగుణంగా మొత్తం ప్రక్రియను మార్చాల్సి ఉంది. ఎన్నికల్లో క్రిమనల్స్‌ పోటీ చేయకుండా, ఎక్కువసార్లు ఒక్కరే పోటీ పడకుండా కూడా నిరోధించాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండుసార్లకన్నా ఎక్కువ పోటీచేసే అవకాశం లేదు. అలాగే మనదేశంలో కూడా ఎంపి,ఎమ్మెల్యేలు కూడా రెండుపర్యాయాలకు మించి పోటీ చేయకుండా చేయాలి. అలా చేస్తే గబ్బిలాల్లా రాజకీయాలను పట్టుకుని వేలాడే సంస్కృతి పోతుంది. ఇకపోతే ఎన్నికల కోసం ప్రతక్ష్యంగా కొంత.. పరోక్షంగా మరికొంత వేలకోట్లల్లో ఖర్చు చేసుకుంటున్నాం. ఎన్నికలు…ఖర్చు.. రాజకీయాలే ఈ ప్రజాస్వామ్యానికి గుదిబండగా మారాయి. నిరంతరం ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంది. దీంతో రాజకీయాల్లో నీతినిజాయితీ కొరవడిరది. కేవలం కొందరు మాత్రమే..అదీ డబ్బుండి పెత్తనం చెలాయించే వారే ఎన్నికల్లో అంతిమంగా లబ్ది పొందుతున్నారు. ఈ దశలో జమిలి ఎన్నికలపై ప్రధాని మోడీ పదేపదే ప్రకటన చేసినా దాని గురించి కూడా స్పష్టత రాలేదు. రాజకీయ పార్టీలు ఎందుకనో దీనిపైనా విముఖత చూపుతున్నాయి. ప్రధానంగా లెఫ్ట్‌ పార్టీలు దీనిని వ్యతిరేకించాయి. ఏది ఎట్లా ఉన్నా ఒకేసారి ఎన్నికలతో ఖర్చు మాత్రం తగ్గుతుంది. ప్రజలు చెమటోడ్చి పన్నుల రూపంలో కట్టిన డబ్బుల వృధా ఆగిపోతుంది. అందులో కొంతయినా మిగులుతుంది. జమిలి కేవలం అసెంబ్లీ, పార్లమెంట్‌తోనే సరిపెట్టకుండా, సర్పంచ్‌ ఎన్నిక దగ్గరి నుంచి అన్ని ఎన్నికలను ఒకేదఫా నిర్వహించాలన్న అభిప్రాయం కూడా ఉంది. పదేపదే ఎన్నికలతో ప్రజల సమస్యలు పక్కన పోతున్నాయి. అభివృద్ది కుంటుపడుతోంది. మన ప్రజాస్వామ్యం బలపడాలంటే ఎన్నికల హింస, ఖర్చు తగ్గించేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. ప్రజాధనం వృధా కాకుండా చూడాలి. రాజీనామాలు చేయడం సవాళ్లు విసిరి ఉప ఎన్నికలు వచ్చేలా చేయడం వంటి వాటిపైనా ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి. ఇలాంటి సందర్భాల్లో ఖర్చు ప్రభుత్వం భరించే స్థితి పోవాలి. తాజాగా హుజూరాబాద్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. సవాళ్లతో అక్కడ రాజకీయం వేడెక్కింది. కేవలం ఈటెల రాజీనామాతో మొత్తం అధికార యంత్రాంగం కూడా అక్కడే పనిచేస్తోంది. అయితే జమిలి ఎన్నికలతో ఇలాంటి సమస్యలపైనా పరిస్కారం ఎలా వస్తుందో ఆలోచించాలి. జమిలి వల్ల ప్రజాస్వామ్యానికీ, దేశంలో ఫెడరల్‌ స్ఫూర్తికి ముప్పు కలుగుతుందని లెఫ్ట్‌ పార్టీలు ముందునుంచీ వ్యతిరేకిస్తున్నాయి. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం దేశంలో హిందుత్వ రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా జమిలి ఎన్నికల పద్ధతిని తీసుకురావాలని చూస్తున్నాయని వారు తమ మూసపద్దతిలో విమర్శలు చేశారు. దేశ వైవిధ్యాన్ని గమనించకుండా ప్రజాస్వామ్యాన్ని, ఫెడరలిజాన్ని కాలరాసేందుకు హిందూత్వ పరివారం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. దేశంలో అనేక ప్రాంతాలు, భాషలు ఉన్నాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఉప ఎన్నిక అనివార్యమైతే ఎలా అన్నదానికి సమాధానం రావాలి. నిజానికి జమిలి మాట ఎలా ఉన్నా త్వరలోనే పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి.
2022లో ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, మణిపుర్‌, గోవా, గుజరాత్‌ల శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి. ఇటీవలే కొన్ని రాష్టాల్ల్రో ఎన్నికలు ముగిసాయి. ఇవన్నీ ఒకేసారి జరపడానికి సాధ్యం కాదని కూడా తేలిపోయింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ సంస్కరణలు దేశీయ ఉత్పత్తుల విలువలో ఏర్పడే ద్రవ్యలోటును భర్తీ చేసుకోగల స్థితిలో కూడా లేదని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. భారతదేశంలో ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికలల్లో ముఖ్యంగా బెంగాల్లో ఫలితాలు మోడీకి వ్యతిరేకంగా వచ్చాయి. వీటినుంచి బయటపడే ప్రయత్నంలో బిజెపి నేతలు ఉన్నారు. రానున్న యూపి, పంజాబ్‌ ఎన్నికలకు కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు ,ఎక్కడ జరిగినా ఇవిఎంలు ట్యాంపరింగ్‌ అవుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈవీఎంలు నిర్వహణ, అవి పనిచేసే తీరు గురించి 2014 ఎన్నికల నుంచి పెద్ద రగడ ప్రారంభమైంది. ఈవీఎంల వల్ల అనేక సందర్భాల్లో ఓటింగ్‌ సరళిలో, లెక్కింపులో పలు రకాల అవకతవకలకు ఆస్కారముందనే అనుమా నాలు రావడంతో దేశవ్యాప్తంగానే ఆందోళన వచ్చింది. దీంతో బ్యాలెట్‌ పేపర్ల వినియోగమే బెటర్‌ అని రాజకీయా పార్టీలు మళ్లీ డిమాండ్‌ చేసాయి. బ్యాలెట్‌ పేపర్లు వస్తే తమ సత్తాచాటుతామని అంటున్నాయి. పార్టీలకు, వాటి అభ్యర్థులకూ అనుకూలంగా మెషీన్ల తయారీ, పనితీరులో మార్పులూ చేర్పులూ చేయ వచ్చునన్న ఆరోపణలను ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ సంస్కరణలు చెల్లుబాటు కావడం లేదన్న ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంస్కరణలు రావాల్సి ఉంది. ప్రశాంతంగా పారదర్శకంగా, డబ్బుల ప్రముయం లేకుండా ఎన్నికల నిర్వహణ జరగాలి. ప్రస్తుత ఎన్నికలు జరగాల్సిన రాష్టాల్రను, జరగబోయే రాష్టాల్రను కలుపుకుని ఇప్పటి నుంచే సంస్కరణలు పెట్టాలి. ఎన్నికల్లో క్రిమినల్స్‌కు అవకాశం లేకుండా చేయాలి. అలాగే విశాల భారతదేశంలో పదేపదే ఎన్నికలు రాకుండా చూడాలి. ఒక్కరే పదిపదిహేను సార్లు పోటీ చేసే అవకావం లేకుండా చేయాలి. కేవలం రెండు పర్యాయాలు మాత్రమే చట్టసభలకు పోటీచేసే అవకాశం ఉంటే పదేపదే పోటీచేస్తూ పాతుకుపోయి అవినీతికి పాల్పడే అవకాశాలు తగ్గుతాయి. పదేపదే ఎన్నికలు ప్రజలపై భారం మోపనున్నాయి. రాష్టాల్రకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరగడం అన్నది ఖర్చురీత్యా మంచి అభిప్రాయంగానే చూడాలి.