ఎన్నికల హావిూలను తుంగలో తొక్కిన కవిత
హావిూలు నెరవేర్చామని చెబితే నమ్మాలా?: సిపిఎం
నిజామాబాద్,ఆగస్ట్31(జనం సాక్షి): జిల్లా ప్రజానీకానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావిూలను మరిచి ఏదో చేసినట్టుగా జిల్లా ఎంపి కల్వకుంట్ల కవిత,జిల్లా ఎమ్మెల్యేలు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఎన్నికల ముందు బోధన్ నిజాం షుగర్స్ పరిశ్రమను ప్రభుత్వంవంద రోజుల్లో స్వాధీనం చేసుకొని నడుపుతుందని హావిూ ఇచ్చి నడుస్తున్న పరిశ్రమను ఎందుకు మూసేసింది సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అదేవిధంగా జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న నిజామాబాద్ కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీనీ ఎందుకు జరిపించలేదు చెప్పాలన్నారు. అధికారంలోకొస్తే పసుపు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసి పసుపు రైతుల ఆదుకుంటామని ఇచ్చిన హావిూ ఏమైందని అన్నారు. లెదర్ పరిశ్రమ ఎక్కడ స్థాపించారో ప్రజలకు చూపించాలన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నిర్లక్ష్యం చేశారని తెలంగాణ రాష్ట్రంలో అన్ని కోర్సులను ప్రారంభిస్తామని నిధులను పెంచుతామని ఇచ్చిన హావిూ ఏమైందని అన్నారు. ఇప్పుడు ఉన్న కోర్సులను ఎందుకు ఎత్తి వేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్ రోడ్డు నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదని గుంతల రోడ్లు ప్రజలకు అవస్థలు ఎందుకని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎంత మంది ప్రజలకు ఇచ్చారని ఇంకా ఎంత కాలానికి పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైందని జిల్లాలో ఉన్న ఉమెన్స్ కాలేజీ ఎందుకని ప్రైవేటీకరించారో సమాధానం చెప్పాలన్నారు. మాధవ్ నగర్ వద్ద ఓవర్ బ్రిడ్జి ఏమైందని ప్రశ్నించారు. జక్రాన్పల్లి విమానాశ్రయం ఎప్పుడు పూర్తయిందని విమర్శించారు. నిర్మించిన మైనార్టీ కాలేజీ ఎప్పుడు ప్రారంభిస్తారని అన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, తగినంత డాక్టర్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని అన్నారు. దళితులకు పేదలకు 3 ఎకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. కౌలు రైతులకు ఎందుకు రైతు బంధు పథకం అమలు చేయలేదని అన్నారు. వీటన్నింటిపైనా సమాధానం చెప్పలేక ముందస్తు ఎన్నికల పేరుతో ప్రజలను మరొకసారి మభ్యపెట్టాలని చూస్తున్నారని కానీ ప్రజలు చాలా తెలివి పరులని, ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు