ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టులో పాకిస్తాన్‌

– స్వాగతించిన భారత్‌, అమెరికా
– ఇకనైనా పాక్‌ తీరుమార్చుకోవాలని ఇరు దేశాల సూచన
న్యూఢిల్లీ, జూన్‌30(జ‌నం సాక్షి) : ఉగ్రవాద సంస్థలకు సురక్షిత స్థావరంగా మారిన పాకిస్తాన్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టులో చేర్చడాన్ని స్వాగతిస్తున్నట్టు భారత్‌, అమెరికా ప్రకటించింది. 26/11 ముంబై పేలుళ్ల నిందితుడు హఫీజ్‌ సయీద్‌ సహా పలు పాక్‌ ప్రేరేపిత ఉగ్రమూకలకు పాకిస్తాన్‌ కొమ్ముకాస్తోందంటూ దుయ్యబట్టింది. ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం స్పందిస్తూ..  ఐసీఆర్‌సీ పర్యవేక్షణ కోసం పాకిస్తాన్‌ను కాంప్లియన్స్‌ డాక్యుమెంట్‌ (గ్రే లిస్టు)లో చేర్చుతూ ఎఫ్‌ఏటీఎఫ్‌ తీసుకున్న నిర్ణయాన్ని భారత్‌ స్వాగతిస్తోందని పేర్కొంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ త్వరగా అమలు కావాలనీ.. ప్రపంచ దేశాల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ తగిన చర్యలు తీసుకోవాలని ఆకాక్షించింది. పారిస్‌ కేంద్రంగా పనిచేసే ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌)… అక్రమ లావాదేవీలు, తీవ్రవాదులకు నిధుల చేరవేత సహా అంతర్జాతీయ ఆర్థిక సమగ్రతకు ప్రమాదంగా పరిణమించిన పలు అంశాలను పర్యవేక్షిస్తుంది. 1989లో ఎఫ్‌ఏటీఎఫ్‌ ఏర్పటైంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్ట్‌లో పేర్కొనడం వల్ల పాక్‌ ఆర్ధిక వ్యవస్థకు నష్టం వాటిల్లడంతో పాటు అంతర్జాతీయంగా ఆ దేశ ప్రతిష్టకు తీవ్ర భంగం వాటిల్లుతుంది. కాగా ఇప్పటికే పలు తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ప్రగతి సాధించామనీ.. మరో 15 నెలల్లో ఉగ్రవాదానికి చెక్‌ పెడతామంటూ ఎఫ్‌ఏటీఎఫ్‌ ముందు పాకిస్తాన్‌ 26 అంశాలతో కూడిన యాక్షన్‌ ప్లాన్‌ కూడా ప్రవేశపెట్టింది. అయితే దీనిపై సంతృప్తి చెందని ఈ గ్లోబల్‌ ఫైనాన్సియల్‌ వాచ్‌డాగ్‌… మరో తొమ్మిది దేశాలతో పాటు పాకిస్తాన్‌ గ్రే లిస్టులో చేర్చింది. ఈ నెల 24 నుంచి 29 వరకు ఇంటర్నేషనల్‌ కోపరేషన్‌ రివ్యూ గ్రూప్‌ (ఐసీఆర్జీ) పర్యవేక్షణ నివేదికపై సవిూక్ష జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతోనైనా పాక్‌ తన తీరు మార్చుకోవాలని భారత్‌, అమెరికాలు సూచించారు. తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకే మిగిలిన దేశాలతో కలిసి రావాలని కోరారు.