ఎమర్జెన్సీతో.. ఇందిర సేవలు విస్మరించలేం

– దేశానికి ఆమె గొప్ప పాలన అందించారు
– ఎమర్జెన్సీ రోజును కాదు.. పెద్ద నోట్ల రద్దు రోజును బ్లాక్‌డేగా నిర్వహించాలి
– భాజపా తీరుపై మండిపడ్డ శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌
న్యూఢిల్లీ, జులై2(జ‌నం సాక్షి ) : కేవలం ఎమర్జెన్సీ విధించారనే కారణంతో ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను విస్మరించలేమని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంజయ్‌ తమ పార్టీకి చెందిన పత్రిక సామ్నాలో పేర్కొన్నారు. ఎమర్జెన్సీని ఎత్తేసిన తర్వాత ప్రజాస్వామ్యంగానే ఆమె ఎన్నికలు నిర్వహించారని, అందులో ఆమె ఓడిపోయారన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్‌ పటేల్‌, రాజేంద్ర ప్రసాద్‌, బీఆర్‌ అంబేడ్కర్‌, నేతాజీ, వీర్‌ సావర్కార్‌ వంటి జాతీయ నేతలు దేశానికి చేసిన సేవలను విస్మరించడం రాజద్రోహమని రౌత్‌ పేర్కన్నారు. దేశంలో ఇందిరాగాంధీ అంత గొప్పగా ఎవ్వరూ పనిచేయలేదని చెప్పుకొచ్చారు. ఎమర్జెన్సీ విధించాలని ఆమె తీసుకున్న నిర్ణయం కారణంగా ఆమె సేవలను మర్చిపోకూడదని అన్నారు. ప్రతి ప్రభుత్వం పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఏది తప్పో, ఏది ఒప్పో ఎవరు నిర్ణయించగలరు? ఎమర్జెన్సీని మర్చిపోవాలి అని సామ్నాలో రాసిన కథనంలో పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజును భాజపా ‘బ్లాక్‌ డే’గా జరుపుకుంటోంది. అయితే ఈ ప్రభుత్వ పాలనలోనూ ఎన్నో బ్లాక్‌ డేస్‌ ఉన్నాయని రౌత్‌ అన్నారు. పెద్ద
నోట్ల రద్దు చేసిన రోజును కూడా ‘బ్లాక్‌ డే’గా ప్రకటించాలని, ఇది ఆర్థికంగా చాలా ఇబ్బందులు కలిగించిందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో చాలా మంది అండర్‌వరల్డ్‌ డాన్లను జైళ్లలో పెట్టారని, ఇప్పుడు మాత్రం నీరవ్‌ మోదీ, ఛోక్సీ, విజయ్‌ మాల్యా లాంటి వాళ్లు దేశాన్ని దోచుకుని విదేశాలకు పారిపోతున్నారని వెల్లడించారు.