ఎమ్మెల్యేను కలవడానికే నా భర్త వెళ్లాడు
కత్తీ,తుపాకితో వెళ్లాడన్నది అబద్దం :కల్లెడ సర్పంచ్ లావణ్య
నిజామాబాద్,అగస్టు2( జనంసాక్షి ) : తనభర్త ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని కలవాలని వెళితే హత్యచేయడానికి వచ్చాడని, ఆయుధాలు ఉన్నాయని చెప్పడం కుట్ర తప్ప మరోటి కాదని ఆర్మూర్‌కు చెందిన కల్లెడ గ్రామ సర్పంచ్ లావణ్య అన్నారు. బంజారాహిల్స్, రోడ్డు నెంబర్ 12లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యకు కుట్ర జరిగిందన్న దానిపై లావణ్య స్పందించారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో తమకు గొడవ జరిగిందని, అప్పటి నుంచే ఆయన మాపై కక్ష పెంచుకున్నారని చెప్పారు. కల్లెడిలో తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన.. రూ.18 లక్షల బిల్లులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆపేశారని ఆరోపించారు. అకారణంగా తనను సస్పెండ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చాలాసార్లు ఎమ్మెల్యే, కలెక్టర్ చుట్టూ తిరిగా మన్నారు. చివరికి హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను కలవడానికే తన భర్త ప్రసాద్ గౌడ్ వెళ్లారని తెలిపారు. తన భర్త కత్తి, తుపాకీ తీసుకెళ్లాడని దుష్పచ్రారం చేస్తున్నారని సర్పంచ్ లావణ్య వాపోయారు. కలవడానికి వచ్చిన వ్యక్తిపైనా నిందలు వేసి అదుపులోకి తీసుకోవడం చూస్తుంటే ఎంతగా కక్ష పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు.