ఎమ్మెల్యే సొంత గ్రామానికి వెళ్లెందుకు దారెటు??

రైల్వే అండర్ బ్రిడ్జి కింద పూర్తిగా నిలిచిన నీరు

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 9 : ఆలంపూర్ శాసన సభ్యులు డాక్టర్ వి. ఎం అబ్రహం సొంత గ్రామానికి వెళ్లేందుకు దారెటు అన్నట్లుగా మారిపోయిన దుస్థితి మండల పరిధిలోని వల్లూరు గ్రామానికి వెళ్లే రహదారి మార్గమధ్యలో రైల్వే ట్రాక్ దగ్గర నెలకొంది. గత నాలుగు ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ ఉండడంతో రైల్వే అధికారులు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ని ఐదు సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. దీనితో అప్పటి నుండి ఇప్పటి దాక వర్షం వచ్చిన ప్రతిసారి రైల్వే అండర్ బ్రిడ్జి కింద పూర్తిగా నీరు నిండిపోవడంతో వల్లూరు గ్రామానికి వెళ్లేందుకు గ్రామస్తులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే వల్లూరు గ్రామం నుండి గద్వాల, కర్నూలు ప్రాంతాలకు రాకపోకలు నిత్యం నిలిచి దీంతో అత్యవసర పరిస్థితుల్లో సైతం ద్విచక్ర వాహనంపై వెళ్లేందుకు ప్రజలకు ఉన్న ఒకే ఒక మార్గం ఇదే కావడంతో ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి ఉందని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటినుండో ఎమ్మెల్యే, రైల్వే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పడంలేదన గ్రామస్తులు మనోవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైల్వే బ్రిడ్జి కింద ఉన్నా నీటిని తొలగించి శాశ్వతంగా సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.