ఎరువులు అందక ఇబ్బందిపెరుగుతున్న పెట్టుబడితో అల్లాడుతున్న రైతన్న
పట్టించుకోని ప్రభుత్వం
వైఎస్‌ఆర్‌సిపి నేత మోషేన్‌రాజు
ఏలూరు, జూలై 21 :జిల్లాలో ప్రభుత్వ అసమర్థత, అధికార యంత్రాంగం అవినీతి వల్ల ఎరువులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోయాయని జిల్లా వైస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, జిల్లా మీడియా కో ఆర్డినేటర్ బివి రమణ ఆరోపించారు. జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్న పరిస్థితుల్లో రైతులు నారుమళ్ళు వేసుకుని ఎరువుల కోసం బ్లాక్ మార్కెట్‌లో పెద్ద మొత్తంలో చేతి చమురు వదిలించుకోవాల్సిన దుస్థితిని ప్రభుత్వమే కల్పించిందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టర్‌తో పాటు వ్యవసాయాధికారులు చేస్తున్న ప్రకటనలు వాస్తవ విరుద్ధంగా కనిపిస్తున్నాయన్నారు. తాడేపల్లిగూడెం, నిడదవోలు కేంద్రాలుగా ఉన్న ఎరువుల హోల్‌సేల్ డీలర్లు ఎరువులను బ్లాక్‌మార్కెట్‌కు తరలించారన్న ఆరోపణలు వస్తున్నా, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పామాయిల్ రైతులు అధికంగా వినియోగించే సూపర్ ఫాస్పేట్‌కు తీవ్రమైన కొరత కనిపిస్తోందని పేర్కొన్నారు. బస్తా 270 రూపాయలకు విక్రయించాల్సి ఉండగా బ్లాక్‌మార్కెట్‌లో 380 రూపాయలకు రైతులు కొనుగోలు చేయాల్సిన దురావస్థ దాపురించిందన్నారు. అలాగే డిఎపి ధర 950రూపాయలు ఉంటే బ్లాక్ మార్కెట్‌లో 1400 రూపాయలకు విక్రయిస్తున్నారన్నారు. పొటాష్ ఎరువు బస్తా 630రూపాయలకు విక్రయించాల్సి ఉండగా 880 రూపాయలకు అమ్ముతున్నారని ఇంత దారుణమైన పరిస్థితులు కిరణ్‌కుమార్‌రెడ్డి చీకటి పరిపాలనకు నిదర్శనంగా రైతులు భావిస్తున్నారన్నారు. తన పదవిని కాపాడుకోవడం కోసం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం టిడిపితో కుమ్మక్కై జగన్‌పై కుట్రలు కుతంత్రాలు చేయడానికే కాలాన్ని వెచ్చిస్తోంది తప్ప రైతుల కష్టాలు వారి సమస్యలు పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని ధ్వజమెత్తారు వ్యవసాయాధికారులు బాధ్యత మరిచి ఎరువుల డీలకర్లపై ఎందుకు ప్రేమ చూపిస్తున్నారో స్పష్టం చేయాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. జిల్లాకు కేటాయించిన ఎరువులు, డీలర్ల వద్ద ఉన్న ఎరువుల స్టాకును విజిలెన్స్ బృందాలతో సమగ్రంగా తనిఖీ చేయిస్తే అసలు బాగోతం బయటపడుతుందని డిమాండ్ చేసారు. డీలర్ల వద్ద మిగులులో ఉన్న ఎరువులను మార్కెఫెడ్, డిసిఎంఎస్ సొసైటీలకు అప్పగించి వాటి ద్వారా రైతులకు నిర్దేశించిన ధరకు విక్రయిం చాలని తమ పార్టీ కోరుతోందన్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మినీ మ్యాథ్యూస్‌కు ఒక వినతి పత్రాన్ని పంపుతున్నామన్నారు. అలాగే కృష్ణా డెల్టాకు సంబంధించి 58వేల ఎకరాల ఆయకట్టుకు కృష్టా కాల్వ నీటిని ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఈ కాల్వకు నీటిని విడుదల చేసే విషయంలో అనుసరిస్తున్న జాప్యం వలన రైతులు నారుమళ్ళు వేసుకోవాలా లేదా అన్న అనిశ్చిత పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. వారిలో నెలకొన్న ఆందోళనను తొలగించాల్సిన బాధ్యతను సిఎంతో పాటు జిల్లా మంత్రులు విస్మరించారని మండిపడ్డారు. ఈ నెల 23న కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్‌ఆర్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తలపెట్టిన చేనేత దీక్షను అడ్డుకుంటామని టిఆర్‌ఎస్ నేతలు కెటిఆర్, విజయశాంతి, ఈటెల రాజేంధర్ చేసిన హెచ్చరికలు సమంజసం కాదన్నారు. విజయమ్మ దీక్షకు రాజకీయ రంగు పులమాలని టిఆర్‌ఎస్ ప్రయత్నాలు చేయడం దురదృష్టకరమన్నారు చేనేత కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే విజయమ్మ దీక్షకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు కల్పించి దీక్షకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.