ఎర్రబెల్లివి ఊసరవెల్లి మాటలు
ఉద్యమంలో పాల్గొనకుండానే మంత్రి పదవి
– బూతులు తిట్టిన నోటితోనే కేసీఆర్‌పై పొగడ్తలా?
– అధికారం కోసం అడ్డదారులు తొక్కే చరిత్ర ఎర్రబెల్లిది
– కేసీఆర్ దగ్గర పాలేర్లు, బానిసలుగా మారిన మంత్రులు
– బీజేపీ కరీంనగర్ పార్లమెంట్
కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు
కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావువి ఊసరవెల్లి మాటలు అని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనని దయాకర్‌రావు తెలంగాణను ఉద్ధరించే సామర్థ్యం తనకే ఉందనే స్థాయిలో బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి జిల్లాలో పర్యటించిన దయాకర్‌రావు ఎక్కడా ప్రజా సంక్షేమం గురించి మాట్లాడలేదని ప్రవీణ్ రావు అన్నారు. బీజేపీపై ఎంపీ బండి సంజయ్ కుమార్ పై విమర్శలు చేయడానికే కరీంనగర్ వచ్చినట్టు ఉందని ధ్వజమెత్తారు. మంత్రి గంగుల కమలాకర్‌కు మొహం లేకనే దయాకర్‌రావును తీసుకొచ్చి విమర్శలు చేయించారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అంటున్న దయాకర్‌రావు గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తు చేసుకోవాలని ప్రవీణ్‌రావు అన్నారు. కేసీఆర్‌ను ఉరిపించుకుంటూ కొడతానంటూ గతంలో మాట్లాడిన దయాకర్‌రావు ఇప్పుడు అదే నోటితో ఆహా ఓహో అని కీర్తించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదని మాట్లాడే మంత్రికి కనీస పరిజ్ఞానం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతీ పథకంలో కేంద్రం ఇచ్చే నిధుల వాటా ఉందని ప్రవీణ్‌రావు చెప్పారు. కనీస పరిజ్ఞానం లేకుండా, కేసీఆర్ దగ్గర పాలేర్లుగా, బానిసలుగా మారిన మంత్రులకు లెక్కల గురించి తెలుస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందని ప్రవీణ్‌రావు ఎద్దేవా చేశారు.