ఎల్‌ఎల్‌ఆర్ లైసెన్సు మేళాకు విశేష స్పందన
విశాఖపట్టణం,ఆగస్ట్28(ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలోని నక్కపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన ఎల్‌ఎల్‌ఆర్ లైసెన్సు మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం దరఖాస్తుదారులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రావిూణ ప్రాంతాల్లో వాహనదారులు అవగాహనలోపంతో లైసెన్సులకు నోచుకోలేకపోయారన్నారు. వీరి సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వంతో మాట్లాడి మేళాను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రవాణాశాఖ జిల్లా ఉపకమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతంగా లక్కపల్లి మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రజలు రహదారి భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. వారం రోజులపాటు మేళాని కొనసాగిస్తామని పేర్కొన్నారు. అనంతరం జారీ చేసిన ఎల్‌ఆర్‌ఆర్ ధృవపత్రాలను ఎమ్మెల్యేతో కలిసి అభ్యర్థులకు అందజేశారు.