ఎస్సీ, ఎస్టీ నిధులు మళ్లించకుండా నిషేధించాలి

రాజకీయ లబ్ధికోసమే చట్టబద్దత

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్ధికోసమే చట్టబద్దత కల్పిస్తున్నట్టు ఆయన ఆరోపించారు. ‘వస్తున్నా.. మీ కోసం’ పాదయాత్ర జిల్లాలో నాల్గోరోజుకు చేరుకుంది. శనివారం మైలారం క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల నిధులు ఇతర వాటికి మళ్లించకుండా నిషేధం విధించాలని, ఆ నిధులు ఖర్చు కాకపోతే, మరో సంవత్సరంలో వాటిని ఖర్చు పెట్టాలని, దామాషా పద్ధతి ప్రకారం గతంలో తాము ఏబీసీడీ వర్గీకరణ చేశామని, అయితే సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల దానిని అమలు చేయలేకపోయామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నదని అన్నారు. ఎస్సీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని ఆయన విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నారని బాబు పేర్కొన్నారు. అంబడ్స్‌మెన్‌ విధానాన్ని పెట్టి, ఎస్సీ,ఎస్టీ  నిధుల ఖర్చును ప్రత్యేకంగా పరిశీలించాలన్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన పథకాలనే కాంగ్రెస్‌ నేటికీ అమలు చేస్తున్నదని, కొత్త పథకాలు ఆ ప్రభుత్వం చేపట్టడంలేదని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరికలేకుండా ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. జిల్లాకు చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఉన్నా రబీ  పంటల కోసం నీటి విడుదలకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బాబు ఆరోపించారు. 4వ రోజు పాదయాత్రను మైలారం క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభించి తిమ్మాపూర్‌ గ్రామంలోని చర్చిలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బాబు పాదయాత్ర మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.  బాబు వెంట జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, హనుమంత్‌ షిండే, అన్నపూర్ణ, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, గంగాధర్‌గౌడ్‌, బాన్సువాడ, బోధన్‌ నియోజకవర్గాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.