ఎస్‌ఎం కృష్ణ రాజీనామా ఆమోదం
న్యూఢిల్లీ, అక్టోబర్ 26 (జనంసాక్షి): విదేశాంగమంత్రి ఎస్‌ఎం కృష్ణ రాజీనామాను ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం నాడు ఆమోదించారు. ఆదివారం నాడు కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో కృష్ణ ఈ రోజు తన పదవికి రాజీనామా చేశారు. యవతకు అవకాశం ఇచ్చేందుకే తాను రాజీనామా చేసేందుకు కృష్ణ చెప్పారు. పార్టీకి విధేయుడిగా ఎలాంటి షరుతులు లేకుండా పార్టీ కోసం పనిచేస్తానని ఆయన చెప్పారు. కృష్ణకు కర్ణాటక పార్టీలో కీలకబాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అంబికా సోనీ, సామాజిక న్యాయం సాధికారిత శాఖ మంత్రి ముఖుల్ వాస్నిక్ కూడా తమ పదవులకు రాజీనామాచేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అనంతరం ప్రధాని మన్మోహన్‌తో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేకంగా సమావేశమై కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసినట్టు సమాచారం. దీంతో ఆదివారం ఉదయం మంత్రి వర్గం పునర్‌వ్యవస్థీకరణ ఖాయమయినట్టేనని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. అయితే రాహుల్ గాంధీ కేబినెట్‌లో చేరతారా లేదా అనేది సందిగ్ధంగానే మిగిలింది. జ్యోతిరాధిత్య సింథియ, సచిన్ పైలెట్‌లకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. గతం నుంచి భావిస్తున్నట్టుగానే శ్రీప్రకాశ్ జస్వాల్, సుబోద్‌కాంత్ సహాయ్, అగాథసంగ్మాకు ఉద్వాసన తప్పదంటున్నారు. సల్మన్‌ఖుర్షీద్ నుంచి మైనార్టీ వ్యవహారశాఖ తప్పించనున్నారు.