ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
కడప, జూలై 29 : అవినీతికి పాల్పడిన కారణంగా జిల్లాలోని ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్‌పి మనీష్‌కుమార్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీన రాజంపేట పట్టణం బ్రాహ్మణపల్లెకు చెందిన ముగ్గురు వ్యక్తులు 5.6 లక్షల నగదుతో ఒక కారులో వస్తుండగా మన్నూరు ఎస్‌ఐ శ్రీనివాసులు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తనిఖీ చేశారు. ఆ మొత్తాన్ని ఎస్‌ఐ శ్రీనివాసులు, కానిస్టేబులు చిన్నోడు, రెడయ్యరాజులతో కలిసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ మొత్తానికి సంబంధించి కొంత విచారణ జరపాల్సి ఉందని, నగదు యజమాని రాజశేఖర్‌కు ఎస్‌ఐ చెప్పాడు. విచారణ అనంతరం ఆయనకు పోలీసులు 3.92 లక్షల రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చారు. తమ వద్ద స్వాధీనం చేసుకున్న మొత్తం 5.06 లక్షల రూపాయలని, వారు ఎస్‌ఐతో వాదించారు. ఎస్‌ఐ అడ్డం తిరగడంతో బాధితులు నేరుగా జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు చేశారు. ఎస్‌పి ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాలని సిఐ వెంకటేశ్వరరావును ఆదేశించారు. సిఐ విచారణ నివేదిక ఆధారంగా ఎస్‌ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ చిన్నోడు, రెడ్డయ్యరాజులను సస్పెండ్ చేస్తూ ఎస్‌పి ఉత్తర్వులు జారీ చేశారు.