ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్
హత్నూర (జనం సాక్షి)
వచ్చేనెల నవంబర్ 26,27,28 తేదీలలో నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించనున్న ఏఐటియుసి 3వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్ కార్మికులకు పిలుపునిచ్చారు.మండలంలోని గుండ్లమాచునూర్ గ్రామ శివారులో గల పారిశ్రామిక ప్రాంతంలో గురువారం హమాలీ కార్మికులతో కలిసి మహా సభకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యానికి పూర్వమే దేశంలోని కార్మికవర్గ  పోరాటాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 1920లో మొట్టమొదటి సారిగా ఏఐటీయూసీ ఏర్పడిందని వారు గుర్తు చేశారు.లాలాలజపతిరాయ్,బాలగంగాధర్ తిలక్ జవహర్లాల్ నెహ్రూ,నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇంద్రజిత్ గుప్తా,ఏపీ బర్దన్ లాంటి పోరాట యోధులు నాయకత్వం వహించిన చరిత్ర ఏఐటీయూసీకి ఉందని వారు తెలిపారు.ఏళ్ల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆయన విమర్శించారు.దేశ విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్నారని వారన్నారు. విచ్చలవిడిగా పెరుగుతున్న ధరాఘాతానికి పేదలు, మధ్యతరగతి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారని వారు పేర్కొన్నారు.కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు మాధవి, కృష్ణ,శ్రీనివాస్,రాజు,శంకరయ్య,నర్సింలు,భూమయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area