ఏటీపీ ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్‌దే టాప్‌ ప్లేస్‌

మహిళల విభాగంలో సెరెనాకు అగ్రస్థానం

న్యూయార్క్‌ ,మే 27 (జనంసాక్షి):

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రారంభమైన వేళ ఏటీపీ ర్యాంకింగ్స్‌ జాబితాను ఇవాళ విడుదల చేశారు. దీనిలో సెర్బియన్‌ స్టార్‌ నోవక్‌ జొకోవిచ్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. జొకోవిచ్‌ ఖాతాలో 12310 పాయింట్లు ఉన్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రఫెల్‌ నాదల్‌ నాలుగో స్థానంలో ఉండగా… ఆండీముర్రే రెండో స్థానంలోనూ , రోజర్‌ ఫెదరర్‌ మూడో స్థానంలోనూ కొనసాగుతున్నారు. గత నాలుగు వారాలుగా టాప్‌ టెన్‌ జాబితాలో మార్పు లేదు. ప్రస్తుతం సెర్బియాకు చెందిన టిప్సారెవిచ్‌ 10వ ర్యాంక్‌ కోల్పోగా.. స్విస్‌ ప్లేయర్‌ వావ్‌రింకా ఆ స్థానంలోకి రావడమే మార్పుగా చెప్పొచ్చు. అటు మహిళల విభాగంలో అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌ అగ్రస్థానం నిలుపుకుంది. సెరెనా 11,620 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌లో నిలవగా… రష్యన్‌ బ్యూటీ మరియా షరపోవా 10015 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మాజీ నెంబర్‌ వన్‌ విక్టోరియా అజరెంకా 9005 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక డెన్మార్క్‌ బ్యూటీ కరోలినా వోజ్నియాకీ 10వ ర్యాంకులో నిలిచింది.