ఏడాదికి రెండు సార్లు నీట్‌, జేఈఈ..!

– ఈ ఏడాది నుంచే అమల్లోకి
– కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడి
న్యూఢిల్లీ, జులై7(జ‌నం సాక్షి): విద్యార్థుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏడాదికి రెండుసార్లు నీట్‌, జేఈఈ పరీక్షలు నిర్వహిస్తామని మానవ వనరుల శాఖ శనివారం ప్రకటించింది. జనవరి, ఏప్రిల్‌లో జేఈఈ, ఫిబ్రవరి, మే నెలల్లో నీట్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు హెచ్‌ఆర్డీ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ విలేకరులతో మాట్లాడారు. కొత్త విధానం ఈ ఏడాది నుంచే అమల్లోకి వస్తుందని అన్నారు. నీట్‌, జేఈఈ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఏ ఒక్క పరీక్షకు సంబంధించి కూడా సిలబస్‌లో మార్పు చేయబోమని స్పష్టం చేశారు. కేవలం పరీక్షా విధానంలో మాత్రమే మార్పు చేస్తున్నామని అన్నారు.  జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలైన నీట్‌, జేఈఈ(మెయిన్స్‌), నెట్‌ ప్రవేశ పరీక్షలను ఇక విూదట నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తుందని ప్రకాశ్‌ జావడేకర్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పరీక్షలను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది.  ఈ పరీక్షలకు విద్యార్థులు రెండు సార్లూ లేదంటే ఏదైనా ఒకసారి హాజరుకావొచ్చని తెలిపారు. ఎక్కువ స్కోర్‌ వచ్చిన పరీక్షను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. జాతీయ అర్హత పరీక్ష(నెట్‌) డిసెంబరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. జేఈఈ(మెయిన్స్‌) ప్రవేశ పరీక్షను ఏడాదిలో జనవరి, ఏప్రిల్‌లలో నిర్వహిస్తామని, నీట్‌ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి, మే నెలల్లో పెడతామని వెల్లడించారు. ప్రతి పరీక్షను నాలుగు లేదా అయిదు తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌ నిర్వహిస్తామని, విద్యార్థులు ఇళ్లలో లేదా అధికారికంగా గుర్తించిన కంప్యూటర్‌ సెంటర్లలో ఉచితంగా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చని జావడేకర్‌ వెల్లడించారు. త్వరలోనే అధికారికంగా గుర్తించిన కంప్యూటర్‌ సెంటర్ల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సిలబస్‌, ప్రశ్నల ఫార్మాట్‌, భాష, ఫీజుల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు.